Saturday, January 21, 2012

పోరాడితేనే సమస్యలు పరిష్కారం

  • ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదు
  • మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది
  • తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం
మహిళా సమస్యల పరిష్కారానికి కేవలం మహిళలే పోరాడితే సరిపోదని, అందరూ కలిసి పోరాడితేనే పరిష్కారమవుతాయని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పార్లమెంటులో మహిళా బిల్లు పాస్‌ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం మళ్లీ అమలు జరిగితే పేదలు బాగుపడతారని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు తగ్గుతాయన్నారు. ఖమ్మంలో జరుగనున్న పార్టీ రాష్ట్ర మహాసభ నేపథ్యంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ  వివరాలు....
మీరు ఉద్యమంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
నేను 11 సంవత్సరాల వయసులోనే ఉద్యమంలోకి వచ్చాను. అపుడు అలాంటి పరిస్థితులు నిజాం పాలనలో ఉన్నాయి. భూస్వాములు ప్రజలను బానిసలుగా చూస్తున్న రోజులవి. పేదలకు ఎలాంటి హక్కులు లేవు. భూస్వాములు, పటేల్‌, పట్వారీలదే రాజ్యం. దేశం అంతా బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మేము మాత్రం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. ఆయన గోర్కి రచించిన నవలను తెచ్చి ఇచ్చారు. ఆ నవలను చదివి ఆ ప్రభావంతో ఉద్యమంలోకి వచ్చాను. నేను అమ్మ పుస్తకాన్ని ఇంట్లో మా అమ్మకు చదివి వినిపించాను. అమ్మ కూడా ఉద్యమం పట్ల వ్యతిరేకత చూపించలేదు. అమ్మ నవల ఆధారంగా అందరూ సమానంగా బతకాలి, స్త్రీ, పురుషులు సమానం అనే భావన మాలో వచ్చింది. ఆంధ్రమహాసభ ప్రభావంతో మాలాంటి ఎన్నో కుటుంబాలు నిజాం వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చాయి. భూస్వాములు వారి ఇష్టారాజ్యంగా పాలిస్తున్న రోజులవి. మహిళల పట్ల వివక్ష విపరీతంగా ఉండేది. భూస్వాముల కుటుంబాల్లోని స్త్రీల పట్ల వివక్ష కొంత తక్కువగా ఉండేది. అమ్మ నవలతో ఉత్తేజం పొందిన నేను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రారంభం నుండి చివరి వరకు వివిధ దశల్లో పాల్గొన్నాను. పాటలు పాడటం, ఉపన్యాసాలు ఇవ్వడం, జనసమీకరణ చేయడంతోపాటు తుపాకి చేతపట్టి గెరిల్లా పోరాటంలోనూ పాల్గొన్నాను. తెలంగాణ పోరాటంలో అయిలమ్మతో కలిసి సభ నిర్వహించినపుడు ఆ సభపై జమీందారులు దాడి చేయించడం మేము ప్రతిదాడి చేయడం ఇంకా గుర్తున్నాయి. నిజాం రజాకార్లు గ్రామాలను తగులబెట్టి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసింది. నన్ను ఒక రక్షణ దళ కమాండర్‌గా నియమించారు. మేము గ్రామాన్ని కాపాడుకోవడం కోసం నిజాం రజాకార్లపై వడిసెలల్లో రాళ్లు నింపి దాడి చేయడం, గుత్పలతో దాడి చేయడం, కారంపొడి కళ్లల్లో చల్లి గ్రామాలను రక్షించుకున్నాం. అలా దళ కమాండర్‌గా, దళాలకు కమాండర్‌గా కూడా పనిచేశాను. అపుడు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే ఆడేవారు. అలాంటి బతుకమ్మ అన్ని కులాల వారు ఆడేలాగా పోరాడి సాధించుకున్నాం. పోరాటం జరిగిన అనంతరం జమీందార్లు, పటేల్‌, పట్వారీలతోపాటు బిసిలు మిగతా కులాల వారు కూడా బతుకమ్మ ఆడటం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామాల్లో జరిగే బాల్య విహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. అందుకోసం గ్రామాల్లో ప్రచారం చేసి బాల్యవివాహాలను జరగకుండా కొంత నిరోధించ గలిగాము. దీంతోపాటుగా వితంతువులుగా మారిన జమీందార్ల మహిళలకు ఆస్తి హక్కు లేదు. వారికి జమీందార్ల ఆస్తుల్లో హక్కు కల్పించాలని పోరాడాము. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారు. వారిలో ఎంతోమంది మహిళలున్నారు.
మహిళల కోసం ప్రభుత్వాలు ఏమి చేయాలి?
ఇపుడున్న ప్రభుత్వాలు గానీ, గత ప్రభుత్వాలు గానీ మహిళలను వివక్షకు, చిన్నచూపు చూశాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మహిళా బిల్లు చట్టం కాలేదు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు చిత్తశు ద్ధితో ప్రయత్నించడం లేదు. మహిళలకు ఉపాధి లేక ఊర్లను ఖాళీ చేసి వలస వెళ్లాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి. తిండి, బట్ట, గూడుకు గ్యారంటీ లేదు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి. అపుడు మాత్రమే మహిళలకు రక్షణ, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఉద్యమ నిర్మాతలు - మార్క్సిస్టు మేధావి మాకినేని


తన అపార అధ్యయనాన్ని అమోఘమైన మేధస్సును సామ్యవాద సమాజ సాధనకు, శ్రమ జీవుల విముక్తి సైద్ధాంతిక సత్యాన్వేషణకు వెచ్చించిన సాటిలేని ప్రజ్ఞాశాలి మాకినేని బసవపున్నయ్య.
మాకినేని భారత కమ్యూ నిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విజ్ఞాన శిఖరం; ఒక సైద్ధాంతిక సర్వస్వం; ఒక రాజనీతి సంపుటం. ఆయన కలం, గళం పదునైనవి. ఎంబిగా సుప్రసిద్దుడైన బసవపున్నయ్య గుంటూరు జిల్లాలో 1914 డిసెంబరు 14 న జన్మించారు.గుంటూరు ఎసి కాలేజీలో బిఎ చదివారు.1930లో స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వ పద్దతులు నచ్చక 1934-35లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ సహాయ కార్యదర్శిగానూ, 1940లో విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగానూ ఎన్ని కయ్యారు. 1940లో పార్టీ గుంటూరు జిల్లా కార్య దర్శిగా, 1943లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికైనారు.1948లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైనారు.1950 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులుగా వున్నారు. వీరతెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేతలలో ఆయన ఒకరు. ముఖ్యంగా దానికి అవసరమైన నిధులు, ఆయుధాలు సేకరించటంలో బసవపున్నయ్య పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. ఆ పోరాటం కొనసాగించాలా లేదా అనే విషయమై తర్జన భర్జనలు జరిగినపుడు వాటిపై స్టాలిన్‌ సలహా తీసుకునేందుకు మాస్కో వెళ్లిన ప్రతినిధి వర్గంలో ఆయన ఒకరు. కమ్యూనిస్టుపార్టీ 1964లో సిపిఐ(ఎం)గా పునర్నిర్మాణమైనప్పుడు కీలకమైన విధాన పత్రాలన్నిటి రూపకల్పనలో ఆయన ప్రధానపాత్ర వహించారు.
రెండు మహా సోషలిస్టు దేశాలైన అప్పటి సోవియట్‌ యూనియన్‌ , చైనాలు రెండూ సిపిఐ(ఎం)తో విభేదించిన కాలంలో పార్టీ సైద్దాంతిక అవగాహనను, రాజకీయ ప్రతిష్టను పెంపొందించడంలో ఎంబి అనన్య సామాన్యమైన పాత్ర పోషించారు.
దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించడం అనే సూత్రాన్ని ఆయన సదా పాటించేవారు. స్టాలిన్‌తోనే గాక మావో, చౌఎన్‌లై తదితరులతో కూడా అనేకసార్లు చర్చలు జరిపారు. పార్టీ అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరించడంలో ఆయన కీలక పాత్ర నిర్వహిం చారు. నాటి సోవియట్‌ యూనియన్‌లో గోర్బచెవ్‌ నాయకత్వం శల్య సారధ్యం ప్రారం భించినట్టు స్పష్టం కాగానే ఆయన ఒక సమగ్ర సిద్దాంత పత్రం రాసి ప్రపంచం పరస్పరా ధారితమనే దివాళాకోరు వాదనలను తుత్తు నియలు చేశారు. మాకినేని వాదనా పటిమ, వ్యంగ్య వైభవం, హాస్యం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. సాహిత్యంలో ఆయనకు మంచి పట్టు వుండేది. తెలుగు సామెతలు, జాతీయాలను అలవోకగా ఉపయోగించే మాకినేని ఆంగ్ల భాషలోనూ అంత ధాటి కనపరచేవారు. జీవితం చివరి క్షణం వరకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకుడిగా పని చేసిన మాకినేని అఖిల భారత ఉద్యమంతో పాటు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి ధృవ తారగా వెలుగొందుతుంటారు.

భూ ఉద్యమానికి విరామం లేదు

  • సరళీకరణ విధానాలతో గ్రామీణ భారతం చిన్నాభిన్నం
  • కార్పొరేటీకరణ కోసమే చిన్న కమతాలపై దుష్ప్రచారం
తెలంగాణ సాయుధ పోరాటకాలం నుండి నేటి వరకు భూ ఉద్యమం కొనసాగుతూనే ఉంది తప్ప దానికి విశ్రాంతి, విరామమూ లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పాటూరు రామయ్య అన్నారు. మధ్యమధ్యలో దాని వాడి, వేడి కొద్దిగా తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే ఏడాదికేడాది పెరుగుతుందే తప్ప తగ్గదని వివరించారు. సరళీకరణ ఆర్ధిక విధానాల నేపథ్యంలో భూముల విలువలు నానాటికీ పెగిపోతున్నాయని వివరించారు. అందువల్ల వాటిని పేదలకు పంచేందుకు పాలకులకు మనసొప్పటం లేదన్నారు. భూ సమస్య పరిష్కారం కావాలనేది ఒక శాస్త్రీయ దృక్పథమని చెప్పారు. సిపిఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భూ సమస్య, సరళీకరణ విధానాలు, వ్యవసాయ సంక్షోభం, చేతి వృత్తులు తదితరాంశాలపై పాటూరు మాట్లాడారు. మహాసభలో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇంటర్వ్యూలోని వివరాలు...
రాష్ట్రంలో దశాబ్దాలుగా భూ సంస్కరణలు జరుగుతున్నాయి. అయినప్పటికీ నేటికీ భూ సమస్య కీలకంగా ఉంది. ఎందుకంటారు?
ఈ అంశాన్ని వివరించాలంటే జాతీయోద్యమం నుండి మొదలెట్టాలి. రాష్ట్రంలోని జమీందార్లు, జాగీర్దార్లు, పెత్తందార్ల చేతుల్లో వేలాది ఎకరాల భూమి ఉండేది. వీరందరూ జాతీయోద్యమంలో పాల్గొనలేదు. అయితే ఆ తర్వాత జాతీయోద్యమ నాయకులతో కలిసి ప్రభుత్వాధినేతలుగా మారారు. ఇదే సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.10 లక్షల ఎకరాల పంపిణీ జరిగింది. ఈ పోరాట ఫలితంగా భూ సమస్య ఒక జాతీయ అజెండాగా మారింది. భూ సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ సాయుధ పోరాటం మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు వస్తాయని ఆనాటి పాలకులు భావించారు. ఈ భయంతోనే వారు భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే భూముల్ని తమ వద్దే అట్టిపెట్టుకునేందుకు వీలుగా అనేక లొసుగులతో ఈ చట్టాన్ని తయారు చేశారు. 1973 నాటి ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసిన తర్వాత మెట్ట, మాగాణికి సంబంధించి పలు విధి విధానాలు రూపొందించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో ఈ భూముల్ని పునర్‌వర్గీకరణ చేస్తే ఇంకో12 లక్షల ఎకరాల మిగులు తేలుతుంది. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమం కింద పంచినదాంట్లో ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల వచ్చిన అటవీ హక్కుల చట్టం కింద 29 లక్షల ఎకరాలను గిరిజనులకు దఖలు పరుస్తామంటూ వైఎస్‌ ప్రకటించారు. అయితే కేవలం 4 లక్షల ఎకరాలే పంపిణీ చేశారు. ఇదే వైఎస్‌ ప్రభుత్వం 9/77 చట్టంలో సెక్షన్‌ (4)లో బి-క్లాజును తొలగించటం ద్వారా అసైన్‌మెంట్‌ భూములపై దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా చేసింది. రాష్ట్రంలోని 3.73 లక్షల ఎకరాల దేవాదాయ భూములు, మరో లక్షన్నర ఎకరాల వక్ఫ్‌ భూములు పెద్దపెద్ద మోతుబరుల చేతుల్లోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుండి ఇప్పటివరకూ ప్రభుత్వం పంచానని చెబుతున్న 55 లక్షల ఎకరాల భూముల్లో సగం అన్యాక్రాంతమయ్యాయి. ఈ విధంగా మన రాష్ట్రంలో భూ పంపిణీ ఒక ప్రహసనం సాగుతూ వస్తోంది. పేదోడికి, వ్యవసాయ కార్మికులకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందువల్లనే భూ సమస్య నేటికీ కీలకంగా ఉంది.
చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గిపోతోందనే వాదన ఉంది. భూ పంపిణీ జరిగితే కమతం సైజు మరింత తగ్గిపోతుంది కదా? దీనిపై మీ అభిప్రాయమేంటి?
ఈ వాదన శుద్దతప్పు. చిన్న కమతాలను అభివృద్ధి పరిచి, నీరు, కరెంటు వసతులు కల్పించి రైతుకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ (విత్తనాలు, ఎరువులు) అందించి, రుణ సదుపాయం కల్పిస్తే వాటి ద్వారా ఎక్కువ ఉత్పత్తిని పొందొచ్చు. ఇవన్నీ ఇవ్వకుండా చిన్న కమతాలపై దుష్ప్రచారం చేయటం తగదు. పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఎకరా, అరెకరా కమతాలే ఉన్నాయి. అయినప్పటికీ వాటికి కావాల్సిన అన్ని వసతుల్ని వామపక్ష ప్రభుత్వం సమకూర్చటం ద్వారా ఆ రాష్ట్రం ఇప్పుడు ఆహారధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలనే దుర్భిద్దిలో భాగంగానే చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గుతుందని పాలకులు ప్రచారం చేస్తున్నారు.
చారెడు భూమి కోసం, జానెడు ఇంటి స్థలం కోసం ప్రజలు లాఠీ దెబ్బలు తినటానికి, జైళ్లకు వెళ్లటానికి, తూటాలకు ఎదరొడ్డడానికైనా సిద్ధపడుతున్నారెందుకని?
ప్రతి వ్యక్తి తనకంటూ ఎంతోకొంత భూమి ఉండాలని కోరుకుంటాడు. దాంట్లో పనిచేసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుందనే భరోసా, ధైర్యం అతడికి వస్తాయి. అతని తదనంతరం అతడి బిడ్డలకు కొద్దిపాటి రక్షణగా ఉంటుంది. భూమి లేని వాణ్ని సమాజం కూడా హీనంగా చూస్తుంది. కొద్దిపాటి జాగా ఉన్నా దాంట్లో గుడిసె వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఎంతోకొంత భూమి ఉంటే ఏడాదిలో ఆర్నెల్లయినా ఆకలితో మాడకుండా బతకొచ్చని అనుకుంటాడు. వీటన్నింటి నేపథ్యంలో భూమి అనేది ఒక సామాజిక హోదా (సోషల్‌ స్టేటస్‌)గా మారింది. అందువల్ల దానికోసం ప్రజలు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడుతున్నారు.
ప్రస్తుతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసమవుతున్నాయి. దీన్ని ఎలా నివారించాలి?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పట్టుగొమ్మ. సువిశాలమైన మన దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీయటం ద్వారా తమ ఆహార వస్తువులను ఇక్కడ అమ్ముకోవచ్చని సామ్రాజ్యవాదులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో) ద్వారా భారత వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టొద్దు, సబ్సిడీలు ఇవ్వొద్దంటూ ప్రపంచబ్యాంకు మన పాలకులను ఆదేశిస్తోంది. వీటికి లొంగిపోయిన మన ప్రభుత్వాలు విత్తనోత్పత్తి, చీడపీడల నివారణ తదితరాంశాల్లో పరిశోధనలను ప్రోత్సహించటం లేదు. మార్కెట్‌లో రైతుకు విత్తనాలు, ఎరువులు అందటం లేదు. ఎరువుల ధరలను నానాటికీ పెంచుతున్నారు. వీటన్నింటినీ తట్టుకుని పంటలను పండించినప్పటికీ గిట్టుబాటు ధరల్లేకపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం వైపునుండి రుణసాయం లేకపోవటంతో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి, తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడిన ఇతర చేతివృత్తులవారూ బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. నగరాలకు, పట్టణాలకు వలసలుపోయి దినసరి కూలీలుగా మారుతున్నారు. ఈ విధంగా సంక్షోభంలో చిక్కుకున్న గ్రామీణ భారతాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వ విధానాలు సామాజిక పురోగమనంవైపు మారాలి. అవి మారనంత వరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.

బూర్జువా పార్టీలవి అవకాశవాద రాజకీయాలు

 
బూర్జువా పార్టీలు అవకాశవాద రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని వివిధ అంశాలపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లలో వక్తలు విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిరలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 'అవకాశవాద రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అంశంపై జరిగిన సెమినార్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పంటలకు గిట్టుబాటు ధరలు 40 శాతానికి పడిపోయాయన్నారు. ఎరువుల, పురుగు మందుల, విత్తనాల ధరలను పెంచి వ్యవసాయాన్ని రైతులకు దూరం చేస్తున్నారన్నారు. ఈ విధానాల వల్ల పదేళ్లలో దేశంలో లక్షా పదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుకు రూ.22,400 సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇదంతా ఎటు పోతోందని ప్రశ్నించారు. సబ్సిడీని నేరుగా రైతుకే ఇవ్వాలని కోరారు. చైనాలో పంటలు వేయకముందే గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని, ఆ విధంగా మనదేశంలోనూ చేస్తే ఉపయోగం ఉంటుందని అన్నారు. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంటు రాక గత ఏడాది 28 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. పార్టీ జిల్లా నాయకులు లింగాల కమల్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, మధిర డివిజన్‌ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
చింతూరులో 'ప్రపంచీకరణ-గిరిజనులపై ప్రభావం' అంశంపై సెమినార్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు, విఆర్‌పురం, కూనవరం మండలాల్లో 'అవకాశవాద రాజకీయాలు-ప్రత్యామ్నాయాలు' అంశంపై వేర్వేరుగా జరిగిన సెమినార్లలో రాష్ట్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడారు. కల్లూరులో 'ప్రపంచీకరణ -వివిధ తరగతులపై ప్రభావం' అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యులు సామినేని రామారావు ప్రసంగించారు.

రానున్నది పోరాటాల కాలం

  • ఎగతాళి చేసిన వారే మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు
  • సిపిఎం అనంతపురం మహాసభల్లో ఎంఎ గఫూర్‌
రానున్నది ప్రజాఉద్యమాల కాలమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ అన్నారు. అనంతపురం సిపిఎం జిల్లా కార్యాలయం (గణేనాయక్‌) గుత్తిరామకృష్ణ ప్రాంగణంలో 10వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సిపిఎం సీనియర్‌ నాయకులు శ్రీరాములు పతాకవిష్కరణ చేశారు. మహాసభలను గఫూర్‌ ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని, పెట్టుబడిదారీ విధానమే సరైందంటూ ఎగతాళి చేసిన వారే నేడు మార్క్సిజాన్ని అధ్యయనం చేయక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరం, శాశ్వతం కాదని మార్క్స్‌ చెప్పారనీ, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక సంక్షోభమే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని యుపిఎ-2 ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తమవుతోందన్నారు. రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. ఇది జరుగుతున్న క్రమంలోనే విద్య, వైద్యరంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా పాలనను కొనసాగించాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని స్థంభింప చేసే పరిస్థితి వస్తుందన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలకు కోత పెడుతూ ప్రజలపై భారీగా భారాలు మోపేందుకు సిద్ధపడుతోందని చెప్పారు. విభజన, సమైక్యవాదం పేరుతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైందన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కష్టజీవులు, పేదల పక్షాన పోరాటాలకు సిపిఎం నాయకత్వం వహించేదిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాసభలకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్‌ హాజరయ్యారు. ఎం.ఇంతియాజ్‌, సావిత్రి, డి.శ్రీనివాస్‌, బిహెచ్‌.రాయుడు, సి.రామకృష్ణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

ఖమ్మంలో సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలు


సిపిఎం 23వ రాష్ట్ర మహాసభలు 2012, ఫిబ్రవరి 2,3,4 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఎం మహా సభలకు రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందాకరత్‌ హాజరవుతారని వెల్లడించారు. మొత్తం 700 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై, రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తామన్నారు. మహాసభల ముగింపు రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Sunday, October 2, 2011

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ప్రత్యేక పథకం


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం మొత్తం 26 శాతం నిధులను కేటాయించాలని కోరారు. సబ్‌ప్లాన్‌ నిధుల దారిమళ్లింపు, కోతలు విధించడం సరికాదన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయని శాఖలు, అధికారులు, ప్రభుత్వాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్‌ప్లాన్‌ పటిష్ట అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ), సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు), సిపిఐఎంఎల్‌(లిబరేషన్‌), సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరుతెన్నులపై శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ(ఎంఎల్‌) నేత గుర్రం విజరుకుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. 'ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులను ఖర్చు చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలను నోడల్‌ ఏజెన్సీలుగా నియమించాలని, ఖర్చు చేయని నిధులను వచ్చే బడ్జెట్‌లో కలిపి అదనంగా కేటాయించాలని, కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు వచ్చే నిధులు, ఆదాయాల్లో స్థానిక జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని, జనరల్‌ బడ్జెట్‌లో వీరికి కేటాయింపులు కొనసాగాలని, సబ్‌ప్లాన్‌ ప్రకారం 26 శాతం ఖర్చు పెట్టాలని, ఖర్చు చేయని వారిని శిక్షార్హులను చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంచాలని' రాష్ట్ర సదస్సు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
విశాల ఐక్య ఉద్యమం కావాలి : రాఘవులు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సక్రమంగా అమలు జరగాలంటే విశాల ఐక్య ఉద్యమం కావాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడినట్లు అని అన్నారు. కానీ పాలకులు బంజారాహిల్స్‌ను అభివృద్ధి చేసి, దానినే అభివృద్ధిగా చూపిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో మంచినీరు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, మరుగుదొడ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. కనీస సౌకర్యాల్లేక దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయని తెలిపారు. పోషకాహారం లేక, వైద్యసదుపాయం లేక ఎస్సీ, ఎస్టీలు బాధపడుతున్నారని వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి చాలా కీలకమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై సామాజిక వివక్షతోపాటు, ప్రభుత్వం అభివృద్ధిలోనూ వివక్ష చూపుతోందని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయింపులు తక్కువ, కేటాయించిన దాంట్లో ఖర్చు తక్కువ, ఖర్చు చేసిన దాంట్లో ఆయా వర్గాల ప్రజలు నివాస ప్రాంతాల అభివృద్ధి ఇంకా తక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతున్న తరుణంలో ప్రయివేటురంగం విస్తరించిపోయిందన్నారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు వర్తించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రం ఆహార భద్రత చట్టం తెస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం మంది మాత్రమే దరిద్రులున్నారని గుర్తించిందని తెలిపారు. సబ్సిడీలు, పింఛన్లు, బియ్యం, కిరోసిన్‌, గ్యాస్‌ వంటి కోటా తగ్గించడానికేనని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనిని సాధించుకోవడానికి విశాల ఐక్య ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
చలో అసెంబ్లీకి సిద్ధం కావాలి : నారాయణ
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తారా? లేదా అన్న అంశంపై ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ చెప్పారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని కోరడం ఈ ప్రభుత్వానికే అవమానకరమని అన్నారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌, టిడిపి దొందూదొందేనని అని విమర్శించారు. రక్షిత మంచినీరు లేనందు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పారు. తక్షణం ఏజెన్సీ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఎ ప్రాంతాల్లో గత ఐదేళ్ల కాలంలో కేటాయించిన నిధులు, ఖర్చు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అప్పుడే గిరిజనుల కోసం చేసిన ఖర్చులో అవినీతి, అభివృద్ధి ఎంతో బయటపడుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటింగ్‌లో పాల్గొన్న శాతాన్ని బట్టి నిధులు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను ప్రతిఘటించాలని సూచించారు. సామాజిక ఐక్యతతో రాజకీయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పోరాటాల ద్వారానే... : రంగన్న
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు జరగాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమని సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ) నాయకులు కె రంగన్న చెప్పారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు భూమిని కూడా పంచాలని డిమాండ్‌ చేశారు. ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు రూ.32 ఆదాయం వస్తే పేదలు కాదని ప్రణాళికా సంఘం చెప్పడం ప్రపంచబ్యాంకు మెప్పు పొందడానికేనని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు, సబ్సిడీలు తగ్గించడానికే పాలకులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ నాయకులు భూతం వీరన్న, కొల్లిపర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడినపుడే సామాజికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి మురళీధర్‌ దేశ్‌పాండే, జానకి రాములు మాట్లాడుతూ సిపిఎం నేత రాఘవులు దీక్ష చేసిన సమయంలో సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామని చెప్పిన మంత్రులు ఇంకా అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన హామీని ఉల్లంఘించిన ఆయా మంత్రులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.