Sunday, October 2, 2011

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ప్రత్యేక పథకం


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం మొత్తం 26 శాతం నిధులను కేటాయించాలని కోరారు. సబ్‌ప్లాన్‌ నిధుల దారిమళ్లింపు, కోతలు విధించడం సరికాదన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయని శాఖలు, అధికారులు, ప్రభుత్వాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్‌ప్లాన్‌ పటిష్ట అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ), సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు), సిపిఐఎంఎల్‌(లిబరేషన్‌), సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరుతెన్నులపై శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ(ఎంఎల్‌) నేత గుర్రం విజరుకుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. 'ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులను ఖర్చు చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలను నోడల్‌ ఏజెన్సీలుగా నియమించాలని, ఖర్చు చేయని నిధులను వచ్చే బడ్జెట్‌లో కలిపి అదనంగా కేటాయించాలని, కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు వచ్చే నిధులు, ఆదాయాల్లో స్థానిక జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని, జనరల్‌ బడ్జెట్‌లో వీరికి కేటాయింపులు కొనసాగాలని, సబ్‌ప్లాన్‌ ప్రకారం 26 శాతం ఖర్చు పెట్టాలని, ఖర్చు చేయని వారిని శిక్షార్హులను చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంచాలని' రాష్ట్ర సదస్సు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
విశాల ఐక్య ఉద్యమం కావాలి : రాఘవులు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సక్రమంగా అమలు జరగాలంటే విశాల ఐక్య ఉద్యమం కావాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడినట్లు అని అన్నారు. కానీ పాలకులు బంజారాహిల్స్‌ను అభివృద్ధి చేసి, దానినే అభివృద్ధిగా చూపిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో మంచినీరు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, మరుగుదొడ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. కనీస సౌకర్యాల్లేక దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయని తెలిపారు. పోషకాహారం లేక, వైద్యసదుపాయం లేక ఎస్సీ, ఎస్టీలు బాధపడుతున్నారని వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి చాలా కీలకమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై సామాజిక వివక్షతోపాటు, ప్రభుత్వం అభివృద్ధిలోనూ వివక్ష చూపుతోందని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయింపులు తక్కువ, కేటాయించిన దాంట్లో ఖర్చు తక్కువ, ఖర్చు చేసిన దాంట్లో ఆయా వర్గాల ప్రజలు నివాస ప్రాంతాల అభివృద్ధి ఇంకా తక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతున్న తరుణంలో ప్రయివేటురంగం విస్తరించిపోయిందన్నారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు వర్తించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రం ఆహార భద్రత చట్టం తెస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం మంది మాత్రమే దరిద్రులున్నారని గుర్తించిందని తెలిపారు. సబ్సిడీలు, పింఛన్లు, బియ్యం, కిరోసిన్‌, గ్యాస్‌ వంటి కోటా తగ్గించడానికేనని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనిని సాధించుకోవడానికి విశాల ఐక్య ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
చలో అసెంబ్లీకి సిద్ధం కావాలి : నారాయణ
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తారా? లేదా అన్న అంశంపై ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ చెప్పారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని కోరడం ఈ ప్రభుత్వానికే అవమానకరమని అన్నారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌, టిడిపి దొందూదొందేనని అని విమర్శించారు. రక్షిత మంచినీరు లేనందు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పారు. తక్షణం ఏజెన్సీ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఎ ప్రాంతాల్లో గత ఐదేళ్ల కాలంలో కేటాయించిన నిధులు, ఖర్చు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అప్పుడే గిరిజనుల కోసం చేసిన ఖర్చులో అవినీతి, అభివృద్ధి ఎంతో బయటపడుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటింగ్‌లో పాల్గొన్న శాతాన్ని బట్టి నిధులు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను ప్రతిఘటించాలని సూచించారు. సామాజిక ఐక్యతతో రాజకీయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పోరాటాల ద్వారానే... : రంగన్న
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు జరగాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమని సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ) నాయకులు కె రంగన్న చెప్పారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు భూమిని కూడా పంచాలని డిమాండ్‌ చేశారు. ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు రూ.32 ఆదాయం వస్తే పేదలు కాదని ప్రణాళికా సంఘం చెప్పడం ప్రపంచబ్యాంకు మెప్పు పొందడానికేనని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు, సబ్సిడీలు తగ్గించడానికే పాలకులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ నాయకులు భూతం వీరన్న, కొల్లిపర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడినపుడే సామాజికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి మురళీధర్‌ దేశ్‌పాండే, జానకి రాములు మాట్లాడుతూ సిపిఎం నేత రాఘవులు దీక్ష చేసిన సమయంలో సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామని చెప్పిన మంత్రులు ఇంకా అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన హామీని ఉల్లంఘించిన ఆయా మంత్రులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment