Saturday, January 21, 2012

పోరాడితేనే సమస్యలు పరిష్కారం

  • ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదు
  • మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది
  • తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం
మహిళా సమస్యల పరిష్కారానికి కేవలం మహిళలే పోరాడితే సరిపోదని, అందరూ కలిసి పోరాడితేనే పరిష్కారమవుతాయని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పార్లమెంటులో మహిళా బిల్లు పాస్‌ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం మళ్లీ అమలు జరిగితే పేదలు బాగుపడతారని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు తగ్గుతాయన్నారు. ఖమ్మంలో జరుగనున్న పార్టీ రాష్ట్ర మహాసభ నేపథ్యంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ  వివరాలు....
మీరు ఉద్యమంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
నేను 11 సంవత్సరాల వయసులోనే ఉద్యమంలోకి వచ్చాను. అపుడు అలాంటి పరిస్థితులు నిజాం పాలనలో ఉన్నాయి. భూస్వాములు ప్రజలను బానిసలుగా చూస్తున్న రోజులవి. పేదలకు ఎలాంటి హక్కులు లేవు. భూస్వాములు, పటేల్‌, పట్వారీలదే రాజ్యం. దేశం అంతా బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మేము మాత్రం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. ఆయన గోర్కి రచించిన నవలను తెచ్చి ఇచ్చారు. ఆ నవలను చదివి ఆ ప్రభావంతో ఉద్యమంలోకి వచ్చాను. నేను అమ్మ పుస్తకాన్ని ఇంట్లో మా అమ్మకు చదివి వినిపించాను. అమ్మ కూడా ఉద్యమం పట్ల వ్యతిరేకత చూపించలేదు. అమ్మ నవల ఆధారంగా అందరూ సమానంగా బతకాలి, స్త్రీ, పురుషులు సమానం అనే భావన మాలో వచ్చింది. ఆంధ్రమహాసభ ప్రభావంతో మాలాంటి ఎన్నో కుటుంబాలు నిజాం వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చాయి. భూస్వాములు వారి ఇష్టారాజ్యంగా పాలిస్తున్న రోజులవి. మహిళల పట్ల వివక్ష విపరీతంగా ఉండేది. భూస్వాముల కుటుంబాల్లోని స్త్రీల పట్ల వివక్ష కొంత తక్కువగా ఉండేది. అమ్మ నవలతో ఉత్తేజం పొందిన నేను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రారంభం నుండి చివరి వరకు వివిధ దశల్లో పాల్గొన్నాను. పాటలు పాడటం, ఉపన్యాసాలు ఇవ్వడం, జనసమీకరణ చేయడంతోపాటు తుపాకి చేతపట్టి గెరిల్లా పోరాటంలోనూ పాల్గొన్నాను. తెలంగాణ పోరాటంలో అయిలమ్మతో కలిసి సభ నిర్వహించినపుడు ఆ సభపై జమీందారులు దాడి చేయించడం మేము ప్రతిదాడి చేయడం ఇంకా గుర్తున్నాయి. నిజాం రజాకార్లు గ్రామాలను తగులబెట్టి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నపుడు కమ్యూనిస్టు పార్టీ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసింది. నన్ను ఒక రక్షణ దళ కమాండర్‌గా నియమించారు. మేము గ్రామాన్ని కాపాడుకోవడం కోసం నిజాం రజాకార్లపై వడిసెలల్లో రాళ్లు నింపి దాడి చేయడం, గుత్పలతో దాడి చేయడం, కారంపొడి కళ్లల్లో చల్లి గ్రామాలను రక్షించుకున్నాం. అలా దళ కమాండర్‌గా, దళాలకు కమాండర్‌గా కూడా పనిచేశాను. అపుడు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే ఆడేవారు. అలాంటి బతుకమ్మ అన్ని కులాల వారు ఆడేలాగా పోరాడి సాధించుకున్నాం. పోరాటం జరిగిన అనంతరం జమీందార్లు, పటేల్‌, పట్వారీలతోపాటు బిసిలు మిగతా కులాల వారు కూడా బతుకమ్మ ఆడటం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామాల్లో జరిగే బాల్య విహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. అందుకోసం గ్రామాల్లో ప్రచారం చేసి బాల్యవివాహాలను జరగకుండా కొంత నిరోధించ గలిగాము. దీంతోపాటుగా వితంతువులుగా మారిన జమీందార్ల మహిళలకు ఆస్తి హక్కు లేదు. వారికి జమీందార్ల ఆస్తుల్లో హక్కు కల్పించాలని పోరాడాము. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారు. వారిలో ఎంతోమంది మహిళలున్నారు.
మహిళల కోసం ప్రభుత్వాలు ఏమి చేయాలి?
ఇపుడున్న ప్రభుత్వాలు గానీ, గత ప్రభుత్వాలు గానీ మహిళలను వివక్షకు, చిన్నచూపు చూశాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ మహిళా బిల్లు చట్టం కాలేదు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు చిత్తశు ద్ధితో ప్రయత్నించడం లేదు. మహిళలకు ఉపాధి లేక ఊర్లను ఖాళీ చేసి వలస వెళ్లాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి. తిండి, బట్ట, గూడుకు గ్యారంటీ లేదు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతోపాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి. అపుడు మాత్రమే మహిళలకు రక్షణ, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి.

No comments:

Post a Comment