Saturday, January 21, 2012

భూ ఉద్యమానికి విరామం లేదు

  • సరళీకరణ విధానాలతో గ్రామీణ భారతం చిన్నాభిన్నం
  • కార్పొరేటీకరణ కోసమే చిన్న కమతాలపై దుష్ప్రచారం
తెలంగాణ సాయుధ పోరాటకాలం నుండి నేటి వరకు భూ ఉద్యమం కొనసాగుతూనే ఉంది తప్ప దానికి విశ్రాంతి, విరామమూ లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పాటూరు రామయ్య అన్నారు. మధ్యమధ్యలో దాని వాడి, వేడి కొద్దిగా తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే ఏడాదికేడాది పెరుగుతుందే తప్ప తగ్గదని వివరించారు. సరళీకరణ ఆర్ధిక విధానాల నేపథ్యంలో భూముల విలువలు నానాటికీ పెగిపోతున్నాయని వివరించారు. అందువల్ల వాటిని పేదలకు పంచేందుకు పాలకులకు మనసొప్పటం లేదన్నారు. భూ సమస్య పరిష్కారం కావాలనేది ఒక శాస్త్రీయ దృక్పథమని చెప్పారు. సిపిఎం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భూ సమస్య, సరళీకరణ విధానాలు, వ్యవసాయ సంక్షోభం, చేతి వృత్తులు తదితరాంశాలపై పాటూరు మాట్లాడారు. మహాసభలో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇంటర్వ్యూలోని వివరాలు...
రాష్ట్రంలో దశాబ్దాలుగా భూ సంస్కరణలు జరుగుతున్నాయి. అయినప్పటికీ నేటికీ భూ సమస్య కీలకంగా ఉంది. ఎందుకంటారు?
ఈ అంశాన్ని వివరించాలంటే జాతీయోద్యమం నుండి మొదలెట్టాలి. రాష్ట్రంలోని జమీందార్లు, జాగీర్దార్లు, పెత్తందార్ల చేతుల్లో వేలాది ఎకరాల భూమి ఉండేది. వీరందరూ జాతీయోద్యమంలో పాల్గొనలేదు. అయితే ఆ తర్వాత జాతీయోద్యమ నాయకులతో కలిసి ప్రభుత్వాధినేతలుగా మారారు. ఇదే సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.10 లక్షల ఎకరాల పంపిణీ జరిగింది. ఈ పోరాట ఫలితంగా భూ సమస్య ఒక జాతీయ అజెండాగా మారింది. భూ సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ సాయుధ పోరాటం మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు వస్తాయని ఆనాటి పాలకులు భావించారు. ఈ భయంతోనే వారు భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే భూముల్ని తమ వద్దే అట్టిపెట్టుకునేందుకు వీలుగా అనేక లొసుగులతో ఈ చట్టాన్ని తయారు చేశారు. 1973 నాటి ఈ చట్టానికి నిబంధనలు తయారు చేసిన తర్వాత మెట్ట, మాగాణికి సంబంధించి పలు విధి విధానాలు రూపొందించారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో ఈ భూముల్ని పునర్‌వర్గీకరణ చేస్తే ఇంకో12 లక్షల ఎకరాల మిగులు తేలుతుంది. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమం కింద పంచినదాంట్లో ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల వచ్చిన అటవీ హక్కుల చట్టం కింద 29 లక్షల ఎకరాలను గిరిజనులకు దఖలు పరుస్తామంటూ వైఎస్‌ ప్రకటించారు. అయితే కేవలం 4 లక్షల ఎకరాలే పంపిణీ చేశారు. ఇదే వైఎస్‌ ప్రభుత్వం 9/77 చట్టంలో సెక్షన్‌ (4)లో బి-క్లాజును తొలగించటం ద్వారా అసైన్‌మెంట్‌ భూములపై దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా చేసింది. రాష్ట్రంలోని 3.73 లక్షల ఎకరాల దేవాదాయ భూములు, మరో లక్షన్నర ఎకరాల వక్ఫ్‌ భూములు పెద్దపెద్ద మోతుబరుల చేతుల్లోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుండి ఇప్పటివరకూ ప్రభుత్వం పంచానని చెబుతున్న 55 లక్షల ఎకరాల భూముల్లో సగం అన్యాక్రాంతమయ్యాయి. ఈ విధంగా మన రాష్ట్రంలో భూ పంపిణీ ఒక ప్రహసనం సాగుతూ వస్తోంది. పేదోడికి, వ్యవసాయ కార్మికులకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందువల్లనే భూ సమస్య నేటికీ కీలకంగా ఉంది.
చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గిపోతోందనే వాదన ఉంది. భూ పంపిణీ జరిగితే కమతం సైజు మరింత తగ్గిపోతుంది కదా? దీనిపై మీ అభిప్రాయమేంటి?
ఈ వాదన శుద్దతప్పు. చిన్న కమతాలను అభివృద్ధి పరిచి, నీరు, కరెంటు వసతులు కల్పించి రైతుకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ (విత్తనాలు, ఎరువులు) అందించి, రుణ సదుపాయం కల్పిస్తే వాటి ద్వారా ఎక్కువ ఉత్పత్తిని పొందొచ్చు. ఇవన్నీ ఇవ్వకుండా చిన్న కమతాలపై దుష్ప్రచారం చేయటం తగదు. పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఎకరా, అరెకరా కమతాలే ఉన్నాయి. అయినప్పటికీ వాటికి కావాల్సిన అన్ని వసతుల్ని వామపక్ష ప్రభుత్వం సమకూర్చటం ద్వారా ఆ రాష్ట్రం ఇప్పుడు ఆహారధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించాలనే దుర్భిద్దిలో భాగంగానే చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గుతుందని పాలకులు ప్రచారం చేస్తున్నారు.
చారెడు భూమి కోసం, జానెడు ఇంటి స్థలం కోసం ప్రజలు లాఠీ దెబ్బలు తినటానికి, జైళ్లకు వెళ్లటానికి, తూటాలకు ఎదరొడ్డడానికైనా సిద్ధపడుతున్నారెందుకని?
ప్రతి వ్యక్తి తనకంటూ ఎంతోకొంత భూమి ఉండాలని కోరుకుంటాడు. దాంట్లో పనిచేసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుందనే భరోసా, ధైర్యం అతడికి వస్తాయి. అతని తదనంతరం అతడి బిడ్డలకు కొద్దిపాటి రక్షణగా ఉంటుంది. భూమి లేని వాణ్ని సమాజం కూడా హీనంగా చూస్తుంది. కొద్దిపాటి జాగా ఉన్నా దాంట్లో గుడిసె వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఎంతోకొంత భూమి ఉంటే ఏడాదిలో ఆర్నెల్లయినా ఆకలితో మాడకుండా బతకొచ్చని అనుకుంటాడు. వీటన్నింటి నేపథ్యంలో భూమి అనేది ఒక సామాజిక హోదా (సోషల్‌ స్టేటస్‌)గా మారింది. అందువల్ల దానికోసం ప్రజలు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధపడుతున్నారు.
ప్రస్తుతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసమవుతున్నాయి. దీన్ని ఎలా నివారించాలి?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పట్టుగొమ్మ. సువిశాలమైన మన దేశంలో వ్యవసాయాన్ని దెబ్బతీయటం ద్వారా తమ ఆహార వస్తువులను ఇక్కడ అమ్ముకోవచ్చని సామ్రాజ్యవాదులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో) ద్వారా భారత వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టొద్దు, సబ్సిడీలు ఇవ్వొద్దంటూ ప్రపంచబ్యాంకు మన పాలకులను ఆదేశిస్తోంది. వీటికి లొంగిపోయిన మన ప్రభుత్వాలు విత్తనోత్పత్తి, చీడపీడల నివారణ తదితరాంశాల్లో పరిశోధనలను ప్రోత్సహించటం లేదు. మార్కెట్‌లో రైతుకు విత్తనాలు, ఎరువులు అందటం లేదు. ఎరువుల ధరలను నానాటికీ పెంచుతున్నారు. వీటన్నింటినీ తట్టుకుని పంటలను పండించినప్పటికీ గిట్టుబాటు ధరల్లేకపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం వైపునుండి రుణసాయం లేకపోవటంతో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి, తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడిన ఇతర చేతివృత్తులవారూ బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. నగరాలకు, పట్టణాలకు వలసలుపోయి దినసరి కూలీలుగా మారుతున్నారు. ఈ విధంగా సంక్షోభంలో చిక్కుకున్న గ్రామీణ భారతాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వ విధానాలు సామాజిక పురోగమనంవైపు మారాలి. అవి మారనంత వరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.

No comments:

Post a Comment