Sunday, October 2, 2011

జాప్యం చేస్తే మరింత క్షీణిస్తుంది

  
  • సత్వర నిర్ణయం తీసుకోండి
  • రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానికి కరత్‌ లేఖ
రాష్ట్రంలోని పరిస్థితులపై ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు,వివిధ తరగతులకు చెందినవారు తమ అభిప్రాయాలను వెల్లడించినందున మళ్లీ పార్టీలతో సంప్రదింపులు చేయవలసిన అవసరం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలిపారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని కరత్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితికి సంబంధించి ఆయన శనివారం ప్రధానికి లేఖ రాశారు. ఆందోళనలతో గత మూడు వారాలుగా తెలంగాణా ప్రాంతం స్తంభించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌పై శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక అందజేసి దాదాపు తొమ్మిది నెలలైంది. ఆ నివేదికను పరిశీలించి ఈ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని తాము భావించినట్లు కరత్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ, సమాజంలోని వివిధ సెక్షన్లు శ్రీకృష్ణ కమిటీకి తమ అభిప్రాయాలు అందజేశాయి. అందువల్ల ఈ విషయంలో రాజకీయ పార్టీలతో మళ్ళీ సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. ఎటువంటి జాప్యానికీ తావివ్వకుండా ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవహారాలపై శుక్రవారం చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ రాష్ట్రానికి మరో బృందాన్ని పంపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరిన్ని సంప్రదింపులు అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఆజాద్‌ కూడా శనివారం చెప్పారు.

No comments:

Post a Comment