Tuesday, September 27, 2011

ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరు

  • సిఐటియు సభల్లో జూలకంటి, శర్మ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, శాసనమండలిలో పిడిఎఫ్‌ నేత ఎంవిఎస్‌ శర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సిఐటియు తొమ్మిదో జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నిర్వహించిన భారీ ప్రదర్శన, బహిరంగ సభల్లో వారు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.రాజారామ్మోహన్‌రారు అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి మాట్లాడుతూ '2జి' కుంభకోణంలో ప్రధాని, హోంమంత్రి పేర్లు విన్పిస్తున్నాయనీ, దేశాన్ని కాపాడాల్సిన వారే కుంభకోణాల్లో ఉంటే ఇక ప్రజాసమస్యలు పరిష్కరించేదెవరనీ ప్రశ్నించారు. యుపిఎ-2, రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించాయనీ, అధికారం చేపట్టాక ఏ ఒక్కటీ అమలు చేయడం లేదనీ విమర్శించారు. యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో నడవడంతో కేంద్రం ప్రజలపై భారాలు వేసే సాహసం చేయలేదనీ, ప్రస్తుతం పదేపదే భారాలు మోపుతూ అన్ని వర్గాలనూ దివాళా తీయించే విధానాలు అమలు చేస్తోందనీ అన్నారు. ఉన్న ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలనీ కోరుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు.
బియ్యానికి 40 కోట్లయితే వ్యాట్‌ వల్ల 4 వేల కోట్ల ఆదాయం
ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.40 కోట్ల చొప్పున ఏడాదికి రూ.480 కోట్ల అదనపు భారం పడుతుందనీ, ఇదే సమయంలో ఇటీవల నిత్యావసరాలపై విధించిన వ్యాట్‌ వల్ల నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందనీ తెలిపారు. తాజాగా పెంచిన పెట్రోల్‌ ధరల వల్లే రాష్ట్ర ఖజానాకు రూ.వెయ్యి కోట్ల అదనపు ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3.50 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు సిద్ధంగా ఉన్నారనీ తెలిపారు. సిఐటియు నాయకులు బేబీరాణి మాట్లాడుతూ తణుకులో నిర్వహిస్తున్న సిఐటియు మహాసభలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. ఇటీవల ప్రణాళికాసంఘం రోజుకు రూ.26 ఖర్చు చేసిన వ్యక్తి పేదవాడు కాదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు.

No comments:

Post a Comment