Tuesday, August 16, 2011

ఆర్థిక సంస్కరణలే అవినీతికి కారణం

  • సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ఆర్‌
20 ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల విష ఫలాల ఫలితమే అంతులేని అవినీతి అని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు అన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిరవధికంగా నడుస్తున్న స్టడీసర్కిల్‌ 200 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుందరయ్యభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం బివికె ఆధ్వర్యంలోనే జరిగిన 'ఆదివారం మీ కోసం' కార్యక్రమంలో '20 ఏళ్లు సంస్కరణల అనుభవాలు' అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్టడీసర్కిల్‌లో ఆయన ప్రసంగిస్తూ..1991 నుండి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలు దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుదలకు కారణాలయ్యాయని తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగినప్పటికీ ఉపాధి రహితమైన అభివృద్ధి కారణంగా నిరుద్యోగం, అవినీతి పోటీపడి పెరుగుతున్నాయని విశ్లేషించారు. పేదలు, మధ్య తరగతి వర్గాలపై పన్నులు పెంచిన యుపిఏ ప్రభుత్వం ఏడేళ్లలో బడా పెట్టుబడిదారులకు 15 లక్షల కోట్ల రాయితీలివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య పోటీ వైరుధ్యాలు ఉండేవని, ప్రస్తుతం వారంతా కుమ్మక్కయి దేశ సంపదను ఊడ్చి పారేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం ఒక సంక్షోభంలో నుండి మరో సంక్షోభంలోకి నెట్టబడుతోందన్నారు.

అమెరికా ఫైనాన్స్‌ సంక్షోభం ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదముంద న్నారు. సంక్షేమానికి కోతలు విధించిన ఫలితంగా ప్రజా పోరాటాలు వెల్లువగా వస్తున్నాయని వివరించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 'మార్క్సిస్ట్‌' సైద్ధాంతిక బులెటిన్‌ సంపాదకులు ఎస్‌.వెంకట్రావ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ టి.ఎల్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణల ఫలితంగానే ఆర్థిక అసమానతలు
రెండు దశాబ్దాల సంస్కరణల అమలు ఫలితంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని 'ఆదివారం మీకోసం'లో కార్యాక్రమంలో శ్రీనివాసరావు అన్నారు. సంపద కొద్ది మంది చేతిల్లో కేంద్రీకృతమైందన్నారు. ఆర్థిక సంస్కరణలన్నీ టాటా, బిర్లా వంటి బడాబాబులకే ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. కొత్తగా బిలినియర్లు తయారయ్యారని, పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన కమిటీ లెక్కల ప్రకారమే దేశంలో ఒక పూటా తినడానికి లేని వారి సంఖ్య 55 శాతంగా ఉందన్నారు. సంస్కరణల వల్ల అభివృద్ధి చెందుతోందున్నది రైతులా, కూలీలా, సంపన్న వర్గాలా అన్నది పాలకులు స్పష్టం చేయాలన్నారు. అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం సంస్కరణలేనన్నారు. వీటి ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో దళితులు ఒకరన్నారు. ప్రభుత్వ రంగం ప్రయివేటు పరం కావడంతో రాజ్యాంగ పరంగా వారికి ఉద్యోగాల్లో రావాల్సిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు రాజకీయాలను శాసిస్తున్నారన్నారు. రాజకీయా ల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని విమర్శించారు. నష్టపోయిన వర్గాలను సమీకరించి సంస్కరణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సదస్సుకు 'ఆదివారం మీ కోసం' కార్యక్రమ అధ్యక్షులు జోసెఫ్‌ అధ్యక్షత వహించారు.
నాలుగేళ్లు- 200 వారాలు పూర్తి చేసుకున్న స్టడీ సర్కిల్‌
ఖమ్మం జిల్లా కేంద్రంలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బివికె) ఆధ్వర్యంలో బహుముఖ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రాజకీయ, సిద్ధాంత చైతన్యాన్ని కలిగించడానికి స్టడీ సర్కిల్‌ నిర్వహిస్తున్నారు. ఇది నాలుగేళ్లు, 200 వారాలను పూర్తి చేసుకుంది. 201వ వారాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో వి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆయన విశ్లేషించారు. తమ్మినేని వీరభద్రం సమన్వయకర్తగా వ్యవహరిస్తు న్నారు. ప్రారంభంలో ఆరుగురితో మొదలై 60 మందికి చేరింది. ప్రతి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మొదట గంటన్నరపాటు మూడు ప్రత్యేక సమస్యలపై ముగ్గురు మాట్లాడతారు. మరో గంట సేపు సబ్జెక్ట్‌ బోధిస్తారు. 9 గంటలకు టిఫిన్‌ బ్రేక్‌ ఉంటుంది. వెంట నే ప్రారంభమయ్యే చర్చలో సభ్యులంతా పాల్గొంటారు. సిలబస్‌ ముందే చెప్పడం వల్ల సభ్యులంతా అధ్యయనం చేసి వస్తారు. ఇప్పటివరకు గతితర్కం, చారిత్రక భౌతికవాదం, చరిత్రలో సైన్స్‌, భారతదేశ చరిత్ర, ప్రపంచ ప్రజల చరిత్ర, సామ్రాజ్యవాదం, భారతీయ తత్వశాస్త్రం, భారతదేశ అర్థిక వ్యవస్థ-పరిణామం అనే ఎనిమిది గ్రంథాలపై బోధన, చర్చ జరిగింది. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు సందర్భంలోనూ వాయిదా పడకుండా నిరవధికంగా స్టడీసర్కిల్‌ సాగింది. ఇందులో ఉన్నత పాఠశాల స్థాయి నుండి జెఎన్‌యులో పిహెచ్‌డి చేసిన స్థాయి వరకు పాల్గొంటున్నారు. అనేక మంది కొత్తగా రాజకీయ, సిద్ధాంత, సైన్స్‌, ఆర్థిక శాస్త్రాలను బోధించగలుగు తున్నారు. వ్యాసాలు, నోట్స్‌ రాయగలుగుతున్నారు. ఇప్పటివరకు 22 జిల్లాల నుండి వచ్చిన వారు ఈ స్టడీసర్కిల్‌ను పరిశీలించి వెళ్లారు. ఖమ్మం స్టడీ సర్కిల్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 స్టడీసర్కిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పది నియోజకవర్గాలలో ప్రతివారం, 46 మండలాలలో ప్రతి 15 రోజులకొక స్టడీసర్కిల్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం స్టడీసర్కిల్స్‌ అనుభవాలతో, రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా స్టడీసర్కిల్స్‌ను విస్తరింపచేస్తున్నామని, సిద్ధాంత అధ్యయనం ప్రాథాన్యతను సిపిఎం కేంద్ర కమిటీ గుర్తించిందని పరిశీలకుడిగా వచ్చిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్‌.వెంకట్రావ్‌ మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్‌ ప్రభావంతో మార్కిస్ట్‌ ఐదు వేల నుండి 30 వేల సర్క్యులేషన్‌ పెరిగిందన్నారు. అధ్యయనం పెరుగుదలకు స్టడీసర్కిల్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment