Tuesday, August 16, 2011

సిపిఎం ఆధ్వర్యంలో జమిందారు కబ్జా భూమిలో జెండాలు

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం గణపవరానికి చెందిన జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆక్రమణలోని అసైన్డ్‌ భూములను పంచాలని వందలాదిమంది పేదలు సిపిఎం ఆధ్వర్యంలో ఆ భూముల్లో సోమవారం జెండాలు పాతారు. సిపిఎం మైలవరం డివిజన్‌, జి.కొండూరు మండల కమిటీల ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు ఎర్రజెండాలు చేబూని ఆర్‌ఎస్‌ నం.360లోని 17.86 ఎకరాల సీలింగ్‌ భూమిని ఆక్రమించారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్‌ కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ పేదలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే భూస్వాములు, జమీందార్ల ఆక్రమణలోని భూములను స్వాధీనం చేసుకోగలుగుతామని చెప్పారు. 1977లో జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సీలింగ్‌ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటూ ఏటా లక్షలాది రూపాయలు గడిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ ఆనాటి నుంచి నేటి వరకూ పొందిన ఆదాయాన్ని రాబట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు ఎస్‌.వి.సారధి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి జమీందారు ఆధీనంలో అసైన్డ్‌ భూములున్నా అధికారులు స్వాధీనం చేసుకోకుండా మిన్నకుండడం బాధాకరమన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి చౌటపల్లి రవి, సిపిఎం జి.కొండూరు మండల కార్యదర్శి బూర్సు శివ పాల్గొన్నారు.

No comments:

Post a Comment