Wednesday, August 17, 2011

ప్రజాస్వామ్య హక్కులపై దాడి

అన్నా అరెస్టుకు సిపిఎం ఖండన - నేడు దేశవ్యాప్త నిరసన
            అన్నాహజారే, ఆయన అనుచరుల అరెస్టును, ఢిల్లీలో నిరాహార దీక్షను నిషేధించడం ద్వారా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాతంత్ర హక్కుపై దాడి చేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ చర్యను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కులపై దాడిగా అభివర్ణించింది. ప్రజాతంత్ర హక్కులపై దాడిని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు జరపాల్సిందిగా సిపిఎం తన శాఖలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నతస్థాయి అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి ఉండగా అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి పోరాటం పట్లనైనా కాంగ్రెస్‌ నాయకత్వ అసహన వైఖరిని ఈ చర్య తెలియజేస్తున్నట్లు సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అధికారిక లోక్‌పాల్‌ బిల్లు బలహీనమైందని, తగిన విధంగా లేదని పునరుద్ఘాటించింది. సమర్థవంతమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేలా ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉందని సిపిఎం ఆ ప్రకటనలో పేర్కొంది.

No comments:

Post a Comment