Thursday, August 4, 2011

భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ

  • 14 ఎఫ్‌పై చిదంబరానిది డొంకతిరుగుడు
  • డిఎల్‌కు చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బయటపెట్టాలి : సిపిఐ(ఎం) 
కేవలం శాసనసభలో చర్చ జరిగిన వాటిపైనే కాకుండా వైఎస్‌ హయాంలో జరిగిన మొత్తం భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో జరిగిన కేటాయింపులతోనూ, అక్రమాలతోనూ కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ లేదంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... గతంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వాటికిచ్చిన రాయితీలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడే భూ కేటాయింపులు, సంస్థల్లో పెట్టుబడులు, ప్రభుత్వమిచ్చిన రాయితీలకు సంబంధించిన లింక్‌ బయటపడుతుందని స్పష్టంచేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించామన్నారు. రాజ్యాంగపరంగానూ, చట్టబద్ధంగానూ జరిగిన విషయాలకు సిఎంతో సహా కేబినెట్‌లోని సభ్యులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందనే నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు కొత్త తర్కం చెబుతున్నారని అన్నారు. వారు చెబుతున్నదే నిజమైతే కేంద్రంలోని ప్రధానికి కూడా ఇది వర్తించాలి కదా? అని ప్రశ్నించారు. అలా ఐతే 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రాజాను కాకుండా ప్రధానమంత్రిని జైల్లో పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. అందువల్ల వైఎస్‌ హయాంలోని కేబినెట్‌ నిర్ణయాలన్నింటినీ వెల్లడించి వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడిస్తున్నారన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో కంపెనీల పెట్టుబడులు, ప్రభుత్వం ఆయా కంపెనీలకిచ్చిన రాయితీలకు సంబంధించి ఆనాటి సిఎందే పూర్తి బాధ్యతంటూ వారు చెబుతున్నారని గుర్తుచేశారు. వీటితో కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ, బాధ్యతా లేదంటూ వారు వాదిస్తున్నారని అన్నారు. అయితే ఏలినవారికిష్టమైనవారికి, దగ్గరివారికి వేలవేల ఎకరాలను కట్టబెట్టిన విషయాన్ని సిపిఎం ఏనాడో బట్టబయలు చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కేవలం శాసనసభలో చర్చ జరిగిన అంశాలపైనే విచారణ జరిపిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. అయినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఇప్పుడు హై కోర్టు జోక్యంతో సిబిఐ విచారణ జరుపుతోందని చెప్పారు.
14 (ఎఫ్‌)ను తొలగించాలంటూ గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగీవ్ర తీర్మానం చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మరోసారి తీర్మానం చేయాలని కేంద్ర మంత్రి చిదంబరం డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని రాఘవులు విమర్శించారు. ఈ అంశంపై మరోసారి పేచీ పెట్టేందుకే ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ మరోసారి ఎందుకు తీర్మానం చేయాలో చెప్పకుండా, గతంలో చేసిన తీర్మానంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించకుండా మళ్ళీ తీర్మానం చేయాలంటూ కోరటమేంటని ప్రశ్నించారు. ఈ ఆలస్యానికి బాధ్యత కేంద్రానిది కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 14 (ఎఫ్‌)ను తొలగించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, ఈ క్లాజును తొలగించిన తర్వాతే ఎస్సై రాత పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని రాఘవులు చెప్పారు. విజయవాడలో టైఫాయిడ్‌, విశాఖ మన్యం ప్రాంతంలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో 20 వైద్య శిబిరాలను నిర్వహిస్తే, ఒక్కోచోట 800 నుండి 900 మంది వరకు రోగులొచ్చారని తెలిపారు. సంక్షేమ గృహాల్లోని విద్యార్థినీ, విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని గుర్తుచేశారు. వీరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదని విమర్శించారు. వైద్యఆరోగ్యశాఖలోని ట్రాన్స్‌ఫర్లు, నియామకాలకు సంబంధించి తనకే అర్థంకాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అంత అర్థంకానప్పుడు ఆ శాఖలో ఉండటం దేనికని ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని చర్యలు చేపట్టిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించారని అన్నారు. మంత్రి డిఎల్‌ తనశాఖ గురించి మాట్లాడాలంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి అసలు విషయాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో అత్యవసర వైద్య సేవల్ని అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని, అధికారులను సమావేశపరచాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం పట్ణణ సంస్కరణలు, ఆస్తిపన్ను పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఆందోళనలను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులుంటే వారిలో కేవలం ఆరు లక్షల మందికే కార్డులను పంపిణీ చేశారని చెప్పారు. వాటిని తీసుకుని రైతులు బ్యాంకులకెళ్తే రుణాలివ్వడంలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాఘవులు చెప్పారు.

No comments:

Post a Comment