Sunday, July 31, 2011

నయాఉదారవాద విధానాలకు స్వస్తి పలకాలి

నయా ఉదారవాద ఛీర్‌ లీడర్స్‌ పట్టుదల విస్తుగొలుపుతోంది. వారు తమ స్వీయ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. నాటి ఆర్థిక మంత్రి డాక్టర్‌ మన్హో హన్‌ సింగ్‌ తన తొలి బడ్జెట్‌ సమర్పించి ( 1991 జులై 24) ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరిన్ని సంస్కరణలు ముఖ్యంగా ద్రవ్య సరళీకరణను మరింతగా తీసుకురావాలని అదే పనిగా రొదపెడుతున్నారు. యుపిఏ-1 ప్రభుత్వం పెన్షన్‌ నిధుల ప్రయివేటీకరణ, బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి పెంపు, విదేశీ బ్యాంకులను మరింత పాత్ర కల్పించేందుకుద్దేశించిన బ్యాంకింగ్‌ సంస్కరణలు, రూపాయికి పూర్తి మారకపు విలువ కల్పించడం వంటి సంస్కరణలను వామపక్షాలు ఆనాడు అడ్డుకోబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం, మాంద్యం దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉండేది. వారు ఈ విషయాన్ని మరచిపోయినట్లు నటించడమో లేక ఉద్దేశపూర్వకంగానే విస్మరించడమో చేస్తున్నారు.
అత్యంత అట్టహాసంగా సాగిన ఆ బడ్జెట్‌ ప్రసంగం విషయానికి తిరిగొస్తే నయా ఉదారవాద విధానాల వ్యవస్థకు అదొక్కటే భావి సూచిక కాదనే విషయం గుర్తించాలి. ఆ బడ్జెట్‌ సందర్భంగానే రెండు సార్లు భారత రూపాయి విలువ పడిపోయింది. సంస్కరణల ముసుగుతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లాలని రాజీవ్‌ గాంధీ ఇచ్చిన పిలుపు దిగుమతులు భారీ స్థాయిలో పెరిగి విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభానికి దారితీసింది. 1985 నుండి 1989 వరకు 350కి పైగా భారత కార్పొరేట్‌ కంపెనీలకు రు. 5,781 కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్య నష్టం సంభవించింది. దిగుమతులు భారీ స్థాయిలో పెరగడంతో భారత దేశ విదేశీ రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 1984 -1991 మధ్య భారతదేశ విదేశీ రుణం రు. 28,000 కోట్ల నుండి రు. 1,00,425 కోట్లకు అమాంతంగా పెరిగిపోయింది.
రెండు దశాబ్దాల తరువాత ఆ ఉల్లాసం ఆవిరైపోయి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. రెండు భారతాలను సృష్టించడంలో మనం ఆరితేరాము. ప్రతి ఒక్కరి జీవన శైలి కొంతమేర మెరుగుపడినా, విపరీతంగా పెరిగిపోయిన ఆదాయ అసమానతలు దుర్భర పేదరికానికి కాకపోయినా పేదరికానికి సూచికగా చూడొచ్చు. ఈ విధానాల వల్ల తలెత్తిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం, రైతాంగ ఆత్మహత్యలు , ఆహార ధాన్యాల, పప్పుల తలసరి అందుబాటు గణనీయంగా పడిపోవడం వంటివి మన ప్రజల్లో కొన్ని తరగతుల్లో పెరిగిపోతున్న దారిద్య్రాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఉజ్వల భారతం వెలుగుజిలుగులు ఈ నలిగిపోతున్న భారతాన్ని మరింత దిగజార్చిన ఫలితమే.
ఈ ఉదారవాద పండితులు నయా ఉదారవాద విధానాల అంతర్జాతీయ ఏజెంట్‌ అయిన ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) 2010లో భారత దేశంలో ఒక అధ్యయనం నిర్వహించిందనే విషయాన్ని గుర్తించాలి.' ఇండియా ఈజ్‌ది రైజింగ్‌ టైడ్‌ లిఫ్టింగ్‌ ఆల్‌ బోట్స్‌ ' అన్న శీర్షికతో ప్రచురించిన పత్రం ప్రపంచం అంతటా గుర్తిస్తున్న ఆదాయ అసమానతల సూచి ( దీనినే జినీ కోఎఫిషియంట్‌ అంటున్నారు) ప్రాతిపదికగా భారత దేశంలో పరిస్థితిని విశ్లేషించింది. 21 శతాబ్దం తొలి దశకంలో ఇది దేశం మొత్తం మీద 0.303 నుండి 0.335కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఈ జినీ కోఎఫిషియంట్‌ 0.343 నుండి 0.378కు పెరిగిందని ఆ పత్రం పేర్కొంది. రెండు భారతాల మధ్య పెరుగుతున్న అంతరాలకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి.
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను అదే పనిగా పొగుడుతున్నవారు ఆయనను ఆర్థిక మంత్రిగా మొదటి స్థానంలో నియమించిన పిపి నరసింహారావును కొంచెం కూడా తలచుకోవడం లేదు. వాస్తవానికి పివి నరసింహారావు తన ప్రభుత్వ చివరి సంవత్సరంలో సంస్కరణల ప్రక్రియ ప్రజలకు ఆహారం, పని, ఆశ్రయం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులను తప్పక కల్పిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదని నిక్కచ్చిగా అంగీకరించారు. 1975 మార్చిలో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు. '' నేడు ప్రపంచం చారిత్రిక మలుపులో ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితి నుండి బయటపడేందుకు తంటాలుపడుతున్నది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సఫలం కాలేదు. నేడు లోలకం మరోవైపు తిరుగుతోంది. ఎదురులేని మార్కెట్‌ వ్యవస్థ మాత్రమే కేంద్ర బిందువవుతోంది. మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ మాత్రమే అత్యంత ముఖ్యమన్న భావన నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. లేనిపక్షంలో పేదలు, బలహీనవర్గాలు మార్కెట్‌లో నెలకొనే పరిస్థితుల కారణంగా ఒక మూలకు నెట్టివేయబడే అవకాశం ఉంది. ప్రజలను కేంద్ర బిందువులను చేయడంలో వైఫల్యం వల్లే ఈ రెండు వైఖరులు ఆచరణలో విఫలమయ్యాయి. ప్రజలను కేంద్ర బిందువులను చెయ్యడం చాలా ముఖ్యం. నిలకడతో కూడిన మానవ పురోగతిని సాధించేందుకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రజల సాధికారిత కేంద్రంగా కలిగిన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరమెంతైనా ఉంది''.
భారత దేశం గురించి ప్రస్తావిస్తూ నాటి ప్రధాని ఇంకా ఈ విధంగా అన్నారు. '' తగిన వనరులు, వివక్షతకు తావులేని మార్కెట్లు, టెక్నాలజీల అందుబాటు లేకుండా పేదరిక నిర్మూలన, సామాజిక సమగ్రత వంటి కీలక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. పేద ప్రజలకు హక్కులు కల్పించేందుకు వ్యవస్థ నిర్మాణం, విధానాలు, వ్యూహాల రూపకల్పన, అన్నిటినీ మించి వివిధ పథకాలు, కార్యక్రమాలు ఫలవంతమయ్యేందుకు దోహదం చేసే పర్యవేక్షణ, విశ్లేషణ వంటి పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటుకు అవసరమైన వనరులను సమకూర్చాలి. జాతీయ స్థాయిలో ఇది జరగాలి. నేను పేర్కొన్న హక్కులు విశాల దృక్పథంతో కూడిన అభివృద్ధికి సంబంధించిన మౌలిక హక్కులు మాత్రమే. మార్కెట్‌, రాజ్యంలో చోటుచేసుకునే వికృత పరిణామాలను చక్కదిద్దేందుకు ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు, విజయాలు సాధించేందుకు దోహడం చేస్తాయి. పేదరికాన్ని పారద్రోలాలనే మన లక్ష్యాన్ని సాధించేందుకు మన దేశంలో ప్రస్తుతం అమలుచేస్తున్న సంస్కరణల నేపథ్యంలో ఇటువంటి సమన్వయాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది''.
ప్రజల ఆర్థిక, సామాజిక సాధికారికత ఈ నయా ఉదారవాద వ్యవస్థలో సాధ్యమేనా? ఇటువంటి విధానాల నుండి వైదొలగడం ద్వారా మాత్రమే ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్థి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మొత్తం మీద దీనిని అంగీకరించేందుకు పివి నరసింహారావు నిరాకరించారు. 1996 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఆయన ఈ అంశాలను ప్రస్తావించారన్న విషయం సుస్పష్టం.
ఈ లక్ష్యాలను సాధించాలంటే మన ప్రజలకు ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య కల్పించే నూతన తరహా సంస్కరణలు కావాలి. అంతకంతకూ ప్రబలుతున్న వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేందుకు కూడా ఇవి అవసరం. అలాగే దేశవ్యాపితంగా భూసేకరణ సందర్భంగా ఉత్పతన్నమైన సమస్యల నుండి ప్రజలను రక్షించాల్సి ఉంది. నయా ఉదారవాద విధానాల అమలు వల్ల సంభవించిన ముఖ్యమైన పరిణామాల్లో ఒకటేమిటంటే పెట్టుబడి పెద్దయెత్తున పోగుపడేందుకు కావాల్సినన్ని నూతన అవకాశాలు ఏర్పడ్డాయి. అటువంటి వాటిలో భూ సేకరణ ఒకటి. రైతుల నుంచి అతి తక్కువ ధరకు భూములను లాక్కొని సూపర్‌ లాభాలు గడిస్తున్నారు. ఈ విధంగా ఆస్తి పోగుపడడాన్ని గురించి అమెరికన్‌ మేధావి ఒకరు నిర్వచిస్తూ పెట్టుబడిదారీ అభివృద్ధి చరిత్రలో ఇది కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. ఆ పారిశ్రామిక విప్లవం వల్ల యూరప్‌లో వీధిన పడ్డ వారిలో అయిదు కోట్ల మంది ఐరోపాను వీడి ''స్వేచ్ఛా ప్రపంచం'' (అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు) తరలివెళ్లారు. ఈ రోజు భూములు కోల్పోయి వీధిన పడ్డనిర్వాసితులకు అటువంటి అవకాశాలు లేవు.వీరి పరిస్థితి కడు దుర్భంగా ఉంటుంది. అందుకే కాలం చెల్లిన 1894 నాటి భూ సేకరణ చట్టం స్థానే కొత్త చట్టాన్ని తేవాలని వామపక్షాలు కోరుతున్నాయి. భూములు కోల్పోయినవారికి తగిన పరిహారం చెల్లించడంతోబాటు, భావి ఉపాధి, భూ సేకరణ తరువాత పెరిగిన ఆ భూముల విలువలో మాజీ యజమానికి కూడా తగు వాటా కల్పించడం వంటివి ఈ నూతన చట్టంలో పొందుపరచాలి. ల్యాండ్‌, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాలు ఎంతో కొంత నామమాత్రపు ధర చెల్లించి రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్లగొట్టే స్థితి రాకుండా ఈ చట్టం రైతులకు అన్ని విధాలా రక్షణ కల్పించాలి.
ఈ విషయంలో వెనక్కి లాగుతున్న ప్రభుత్వం సమగ్ర ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం అమలుకు తగినన్ని నిధులు లేవని బీద అరుపులు అరుస్తోంది. ఈ అరుపులు అసంబద్ధమైనవే కాదు, మెగా స్కాములకు మూల హేతువైన నయా ఉదారవాద విధానాల దుష్ఫరిణామాలను వక్రీకరించడమే. మన దేశంలో వనరులకు లోటు లేదు. అవినీతిపరులైన రాజకీయనాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ మీడియా కుమ్మక్కయి ఈ వనరులను యథేచ్ఛగా లూటీ చేస్తుంటే వాటిని ఎదుర్కోవాలనే రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే అసలు లోపం.
ఈ సంస్కరణలపై కేంద్రీకరించే బదులు మన ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. కానీ, నేడు మలి విడత సంస్కరణల గురించి మాట్లాడడం ప్రభుత్వానికి ఒక ఫ్యాషనైపోయింది. రిటైల్‌ వ్యాపారంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం గురించి మాట్లాడుతున్నది. ఇదే జరిగితే దేశ వ్యాపితంగా ఈ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది భారతీయ చిల్లర వర్తకులు వీధిన పడతారు. మనం ప్రస్తావిస్తున్న ఈ సంస్కరణలు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించే మాట అలా వుంచి మరింత వినాశనానికే దారితీస్తాయి.
ఈ నయాఉదారవాద విధానాలనుంచి ప్రస్తుత యుపిఏ-2 ప్రభుత్వం పూర్తిగా వైదొలిగేందుకు ప్రజా ఒత్తిడిని పెద్దయెత్తున పెంచాల్సిన అవసరం ఉంది. అసమానతలను పెంచుతూ దేశ వనరులు లూటీకి ఊతమిచ్చే ఈ నయా ఉదారవాద విధానాలే ప్రజలు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను సంతరించుకోవడానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వీటిపై పోరాటాల్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం

No comments:

Post a Comment