Sunday, September 11, 2011

మత హింస, మైనార్టీల పట్ల వివక్షకు తెరదించే చర్యలను పరిశీలించండి

  • ప్రభుత్వ విధానాల వల్లే యువతలో నిరాశా, నిస్పృహ
  • జాతీయ సమగ్రతా మండలిలో సిపిఎం
దేశంలో నానాటికి పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను వక్రమార్గం పట్టించటం వంటి అంశాలకు తెరదించే చర్యలను పరిశీలించాలని జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసి)కి సిపిఎం సూచించింది. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన మండలి సమావేశానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పలు సూచనలతో కూడిన పత్రాన్ని అందజేశారు. 2008 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌ఐసి భేటీ తరువాత మూడేళ్ల విరామం అనంతరం భేటీ అయిన ఎన్‌ఐసి జాతీయ సమగ్రత, మతోన్మాదం వంటి అంశాల పట్ల సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతోందని ఆ పత్రంలో పేర్కొన్నారు. మతోన్మాదం, పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అంశాలపై ఈ సమావేశంలోనైనా చర్చించి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మతోన్మాదం సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలతో ముడపడి వున్నదన్న కరత్‌ మతోన్మాదం తగ్గిందని ఎవరైనా వాదిస్తే దానితో తాను ఏకీభవించబోనన్నారు. మతోన్మాదం తగ్గిందన్నా, పెరిగిందన్నా అందుకు ఆ ఏడాది కాలంలో జరిగిన ఘటనలను ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

2009లో మొత్తం 791 మతోన్మాద ఘటనలు జరగ్గా అందులో 119 మంది మరణించారని, 2,342 మందికి పైగా గాయాలపాలయ్యారని కరత్‌ వివరించారు. 2010లో 658 ఘటనలు జరిగి 111 మంది మరణించగా, క్షతగాత్రులైన వారి సంఖ్య 1,971గా నమోదయిందని ఇవి సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అందచేసిన వివరాలేనని ఆయన తెలిపారు. 2005-09 మధ్య జరిగిన మతోన్మాద హింసాత్మక ఘటనల్లో ఏటా 130 మంది ప్రాణాలు కోల్పోగా 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని ఆయన గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఈ సంఖ్యలో ఒకటి, అరా తగ్గుదల ఉన్నప్పటికీ దీనితోనే సంతృప్తి చెందటానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మతోన్మాదం, మతోన్మాద రాజకీయ ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతుండటం జాతీయ సమైక్యతను దెబ్బతీయటమే కాక మన దేశ లౌకిక ఛత్రాన్ని ఛిద్రం చేస్తుందని కరత్‌ అభిప్రాయపడ్డారు. మతోన్మాదానికి మత ఛాందసవాదం, మతం రంగు పులుముకుంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు ఆజ్యం పోస్తున్నాయన్నారు. మతోన్మాదం, మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం వుందన్నారు. అయోధ్య అంశంపై 1992లో మొదలైన మతోన్మాద రాజకీయాల విపరిణామాలను అందరం చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయతా వాదం పేరిట జనం మధ్యలోకి వస్తున్న రాజకీయాలు మెజార్టీ మతోన్మాదం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు.

మైనార్టీ మతోన్మాదం కూడా లౌకిక వాదానికి ప్రమాదకరమేనన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలున్నంత కాలం మతోన్మాదం కొనసాగుతూనే వుంటుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో మతోన్మాద సైద్ధాంతికతను ప్రవేశపెట్టేందుకు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన ఇటువంటి లౌకిక వ్యతిరేక మతోన్మాద సైద్ధాంతికతను కూకటి వేళ్లతో పెకలించివేయాల్సిన అవసరం వుందన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, మైనార్టీల పట్ల విషం కక్కటం వంటి చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
ఉగ్రవాదంపై...
భారత్‌లో ఉగ్రవాదం ప్రధానంగా మతపరమైన తీవ్రవాదం, మత విద్వేషాల నుండి పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదులకు మతం లేదనటంతోనే సరిపోదని, మత తీవ్రవాదం, మతోన్మాదం ఉగ్రవాదానికి బీజాలు వేస్తున్నాయన్న సంగతిని మనం మరువరాదని అన్నారు. మన దేశంలో మతోన్మాదానికి ఉగ్రవాదానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో మత తీవ్రవాదం ఉగ్రవాద హింసకు ఆజ్యం పోస్తోందని ఇందుకు ప్రధానంగా కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు దోహదం చేస్తున్నాయని కరత్‌ వివరించారు. ముంబయి నగరంలో జులైనెలలో జరిగిన పేలుళ్లు, ఢిల్లీ హైకోర్టువద్ద పేలుళ్ల వంటి ఘటనల ద్వారా ఈ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కరత్‌ తెలిపారు. ఈ సంఘటనల ఆధారంగా కేవలం ఏదో ఒక సెక్షన్‌కు ఉగ్రవాదాన్ని అంటగట్టి వారిని మత సమీకరణకు లక్ష్యంగా చేయటం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. మలేగావ్‌, మక్కా మసీదు, అజ్మీరే షరీఫ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఘటనల వెనుక కొన్ని హిందూత్వ తీవ్రవాద శక్తులున్నాయని దర్యాప్తులో తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మతోన్మాదాన్ని, మత తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడే ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా నిర్మూలించగలమని కరత్‌ పునరుద్ఘాటించారు.
మత హింస బిల్లుపై...
మత హింసను సమర్ధవంతంగా ఎదుర్కొని అందుకు పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు విధించే విధంగా పాలనాయంత్రాంగానికి విస్తృతాధికారాలనిచ్చే చట్టం అవసరమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఇటువంటి మతోన్మాద హింసకు బలైన బాధిత కుటుంబాలకు పరిహారాన్ని, పునరావాసాన్ని అందచేసే విధంగా ఈ చట్టం వుండాలన్నారు. మత హింస ఘటనలకు చెక్‌ పెట్టేందుకు పాలనాయంత్రాంగానికి, పోలీసులకు ఈ చట్టం ద్వారా జవాబుదారీ తనాన్ని కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఇది చేసేటప్పుడు రెండు విషయాలను దృష్టిలో వుంచుకోవాలని, ఈ చట్టం కేవలం మతపరమైన హింసపై మాత్రమే దృష్టి పెట్టాలి తప్ప ఇతర రకాలైన హింస, ఘర్షణలపై దృష్టి పెట్టరాదని, అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ, పోలిసింగ్‌ వంటి రాష్ట్రాల ప్రాథమిక బాధ్యతల అంశాల్లో ఈ చట్టం దేశ సమాఖ్య సూత్రాన్ని దృష్టిలో వుంచుకుని అమలు జరగాలని వక్కాణించారు.
మైనార్టీలపై వివక్ష
దేశంలోని మైనార్టీల్లో అధికశాతంగా వున్న ముస్లింలు తీవ్ర అణచివేతకు, వివక్షకు గురవుతున్నారని కరత్‌ తెలిపారు. సచార్‌ కమిటీ నివేదిక ఈ అంశాన్ని సమగ్రంగా వెలుగులోకి తెచ్చిందనీ విద్యా, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఫలాలను అందుకోలేనంత దూరంలో ముస్లిం సమాజం వెనుకబడి వుందని గుర్తు చేశారు. ఈ వెనుకబాటును తొలగించేందుకు సమాన హక్కుల కమిషన్‌ ఏర్పాటు వంటి సచార్‌ కమిటీ చేసిన సూచనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. సామాజికాభివృద్ధి, వ్యయంలో మైనార్టీలకు తగిన వాటా దక్కేందుకు ఉప ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరంపై సిపిఎం దీర్ఘకాలంగా ప్రభుత్వంతో వాదిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. షెడ్యూల్డు తెగలవారికి తీరని అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతోనే వారి ఉనికికి ముప్పు వాటిల్లుతోందని కరత్‌ తెలిపారు. ఇందుకు ఉదాహరణ ప్రభుత్వ మైనింగ్‌ విధానమేనన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైనింగ్‌ విధానం వల్ల భారీఎత్తున ఆదివాసీలు కూడు, గూడు కోల్పోయి నిర్వాసితులవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూముల్లో కార్పొరేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు కట్టుబెట్టటం ద్వారా ప్రభుత్వం ఆదివాసీల ప్రాథమిక హక్కులను, జీవనాధారాన్ని కాలరాస్తోందన్నారు.
పౌర ఘర్షణలు...
పౌర ఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం వలసకాలం నాటి చట్టాలనే ఉపయోగిస్తోందని గత ఏడాది జూన్‌లో కాశ్మీర్‌ లోయలో జరిగిన అల్లర్లు, అశాంతి పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వేసవి కాలంలో దాదాపు 120 మంది యువకులు పోలీసులు, భద్రతా దళాల బుల్లెట్లకు బలయ్యారని వివరించారు. ఆగ్రహంతో రాళ్లు రువ్వే యువతను ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు వారిని కాల్చి చంపి మాయం చెయ్యాలన్న విధానాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఈ అమానుషమైన విధానానికి తీవ్రవాదం వంటి అశాంతిని ఎదుర్కొనే విధానాలే మూల కారణమన్నారు. ప్రజా ప్రదర్శనలను, పౌర అశాంతిని సరైన విధంగా ఎదుర్కొనేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు. ప్రజా ప్రదర్శనలు, నిరసనల పట్ల పోలీసుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని ఇటీవలి కాలంలో గమనిస్తున్నామని, రాజ్యాంగం ప్రసాదించిన సమావేశ హక్కు (రైట్‌ టు అసెంబ్లీ) పూర్తిగా కాలరాయబడిందని ఆయన గుర్తుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిషేధించేందుకు అధికార యంత్రాంగం, అప్పుడప్పుడూ కోర్టులు విధిస్తున్న నిషేధాజ్ఞల కారణంగా ప్రజాస్వామిక హక్కులు హరింపబడుతున్నాయన్నారు. ఇటీవలి కాలం లోఅవినీతికి వ్యతిరేకంగా జరిగిన శాంతియుత ప్రదర్శ నల ను సైతం పోలీసు బలగాలు ఏ విధంగా అణచివేశాయో మనందరం కళ్లారా చూశామని ఆయన గుర్తు చేశారు. ప్రజా స్వామిక హక్కులను కాలరాయటం, బహిరంగ ప్రదేశాల్లో శాంతి యుత నిరసనలను అడ్డుకోవటం వంటి చర్యలు సామాజిక అశాంతికి ఆజ్యం పోస్తాయని ఆయన హెచ్చరించారు.
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు...
యువతను సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఆధారంగా సానుకూల దిశలో మర్చాల్సి వుండగా వారిని మతం, కులం వంటి అంశాల ఆధారంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సామాజికాభివృద్ధికి, లౌకిక, మత సామరస్యానికి హాని చేస్తుందని ఆయన హెచ్చరించారు. యువత తీవ్రవాదం వైపు ఎందుకు మళ్లుతున్నారన్న అంశాన్ని మొదటిగా మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, యువత ప్రాథమిక అవసరాలు తీరకపోవటం వల్లే ఈ అశాంతి పెరుగుతోందని, యువత భవితకు నిరుద్యోగం పెను శాపంగా మారిందని ఆయన అన్నారు. జాతీయ నమూనా సర్వే లెక్కల ప్రకారం ఉపాధి అవకాశాల పెరుగుదల 2000-2005 మధ్య కాలం నాటి 2.7 శాతం నుండి 2005-10 మధ్య కాలానికి 0.8 శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలపై కోత విధిస్తున్న ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 10,81,336 ఉద్యోగాలు ఖాళీగా పడి వున్నాయన్నారు. ఉపాధి కల్పనలో ఏమీ చేయకుండా మార్కెట్‌ శక్తులే ఉద్యోగాలిస్తాయన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం లభించక నిరాశ, నిస్పృహలకు గురవుతున్న యువత మతోన్మాదం, ప్రాంతీయవాదం, కులం వంటి విభజన శక్తుల ఆకర్షణకు గురవుతున్నదన్నారు. దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక మార్పుల్లో యువతకు భాగస్వామ్యం కల్పించటం ఇప్పుడు పెనుసవాలుగా మారిందన్న కరత్‌ వారికి సరైన అవకాశాలు కల్పించి ఉత్పాదకతలో భాగస్వామ్యం కల్పించటం ద్వారా వారు తమ జీవితాలను సామాజిక న్యాయంతో, గౌరవంతో కొనసాగించగలరన్న విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, విధానాల్లో సమూలమైన మార్పులు రావాలని, ఇటువంటి మార్పులకు యువత తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని కరత్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment