Sunday, September 11, 2011

గిరిజనుల ప్రాణం నిలబెట్టే కృషి

ప్రభుత్వం తన బాధ్యత విస్మరించడంతో మానవత్వం ఉన్న దాతలు ఇచ్చిన సహకారంతో జన విజ్ఞానవేదిక, గిరిజన సంఘం మన్యం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు అన్నారు. శనివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విశాఖ మన్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలను నిలబెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో 'కురు, కురు...' అంటూ 108 సేవల గురించి ప్రచారం చేసి ఓట్లు పొంది, ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. 104 దండగంటూ రూ.200 కోట్లు వృథా అయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి అనడాన్ని విమర్శిస్తూ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. వీటిని సంస్కరించి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీని కేరళ పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఉపయోగపడే రీతిలో కాకుండా ప్రభుత్వాసుపత్రులు అభివృద్ధి చెందేలా ఆరోగ్యశ్రీని సమగ్ర పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. హెపటైటిస్‌-బి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, విశాఖ మన్యంలో మలేరియాతో అనేక మంది మరణించారని చెప్పారు. డెంగ్యూ కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రబలుతోందన్నారు. దాతలు ఇచ్చిన మందులతో విశాఖ మన్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ సర్జికల్స్‌ అధినేత పి.రఘు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment