Tuesday, September 27, 2011

ప్రజల జీవితాలతో ఆటలా?

  •  
  • ప్రణాళికా సంఘంపై బృందాకరత్‌ ఆగ్రహం
ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని భారత ప్రణాళికా సంఘం అంకెలతోనే కాక ప్రజల జీవితాలతో కూడా ఆటలాడుకుంటోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 రూపాయలు ఖర్చు పెడితే వారు పేదలు కారని చెబుతూ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికకు ప్రామాణికత ఏమిటని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు. ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న ధరల్లో 26 రూపాయలతో ఒక వ్యక్తికి ఒకపూట భోజనం కూడా లభించని దుస్థితి నెలకొని ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు. ఒక వ్యక్తి పనిచేయాలంటే 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ స్థిరీకరించిన ప్రమాణాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌ జిల్లాలో కరువు ప్రభావంతో చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఆదివాసీలు రెండు లేదా మూడు రోజులకోసారి ఒక్కపూట మాత్రమే భోజనం చేసి కాలం గడిపేవారని అనేక నివేదికలు వెల్లడించినట్లు ఆమె పేర్కొన్నారు. మన దేశంలో ఆకలి స్థాయి ఇలా ఉంటే ప్రణాళికా సంఘం మాత్రం దేశవ్యాప్తంగా తన కాకిలెక్కలను రు ద్దుతూ మీరు, మీ పిల్లలు ఒక్కపూట కన్నా ఎక్కువ తింటే మీరు పేదలు కారంటోందని ఆమె విమర్శి ంచారు. పేదరికపు అంచనాలు ప్రభుత్వ విధానాల రూప కల్పన, పర్య వేక్షణకు విస్త్తృత స్థాయి సూచి కలుగా పనికోస్తా యన్నారు.

90వ దశకంలో ప్రజా వ్యతిరేక నయా ఆర్థిక సంస్కరణ విధానాలు అమలులోకి వచ్చే వరకూ అప్పటి ప్రభుత్వాలు ఈ విధానాన్నే అనుసరించినట్లు గుర్తు చేశారు. దేశంలో పేదలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కుటుంబాల స్థాయిలో లెక్కలు అవసరమని, అయితే దేశంలో పెరిగిపోతున్న పేదరిక నిర్మూలనా పథకాల ఫలితాలను అధికారికంగా గుర్తించిన పేదలకు మాత్రమే పరిమితం చెయ్యాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆహార సబ్సిడీలు, ఆరోగ్యం, గృహనిర్మాణం, బ్యాంకు రుణాలు, పెన్షన్లు, బాలబాలికలకు సహాయం వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాలు ఇందుకు లక్ష్యంగా మారుతున్నాయని అన్నారు. పేదరికాన్ని అంచనా వేసి, పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రధానమన్న విషయాన్ని ఈ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని ఆమె వివరించారు. అయితే ఈ విధానాలను పక్కనబెట్టి అందుకు బదులుగా పారదర్శకత లేని ఏకపక్ష, మోసపూరిత విధానాలను ప్రణాళికా సంఘం అమలు చేస్తూ పేదరికపు అంచనాలపై కాకిలెక్కలు వేస్తోందని ఆమె విమర్శించారు. గత దశాబ్ద కాలంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల పేదరికపు అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, తదితర వర్గాల నుంచి పదేపదే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయాన్ని గుర్తించాలని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలో పేదరికపు స్థాయిని వివిధ కమిటీలు 27 శాతం నుంచి 77 శాతం వరకూ అంచనా వేసినట్లు ఆమె గుర్తు చేశారు. అందులో ప్రభుత్వం ఆమోదించిన టెండూల్కర్‌ కమిటీ అంచనాలు తప్పుడు తడకలని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు స్వతంత్రంగా పనిచేసే గ్రామీణాభివృద్ధి శాఖను ప్రణాళికా సంఘానికి అప్పగించారన్న బృందాకరత్‌ రూ.11 వేల వార్షిక ఆదాయ పరిమితితో 1992లో తొలిసారిగా పేదరిక అంచనాల సర్వేను నిర్వహించారన్నారు.దేశంలో 52 శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారంటూ అప్పట్లో వేసిన అంచనాలను ప్రణాళికా సంఘం తిరస్కరించిందని, అప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామంటూ యుపిఎ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఆహార భద్రతా చట్టం ప్రణాళికా సంఘం పెడుతున్న పరిమితులను చట్టబద్ధం చేయడానికి మాత్రమే పనికొస్తుందని బృందాకరత్‌ ఎద్దేవా చేశారు. ప్రణాళికా సంఘం కాకిలెక్కలను పక్కనబెట్టి చట్టబద్ధమైన ప్రజల డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు కేసు ఒక అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ఆ డిమాండ్‌ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ విస్తరణ కోసం పోరాటంగా మాత్రమే కాక ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, గృహనివాసం, తదితర కనీస అవసరాలను హక్కుగా కల్పించేందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు పన్ను మినహాయింపుల రూపంలో కోట్లాది రూపాయలను పందేరం చేసే ప్రభుత్వం తన ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరించు కుంటే ఈ డిమాండ్‌ సాకారం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

No comments:

Post a Comment