Sunday, September 11, 2011

రిలయన్స్‌పై చర్యలు

  • మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలి
  • నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పునఃసమీక్షించాలి
  • కెజి డి-6 ఉదంతంపై సిపిఎం డిమాండ్‌
   కెజి బేసిన్‌ విషయంలో కాగ్‌ నివేదిక ఆధారంగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిడెట్‌పై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్‌ చేసింది. భూ ఉపరితల, సముద్రాంతర్భాగ (ఆన్‌, ఆఫ్‌షోర్‌) చమురు, సహజవాయు అన్వేషణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి కాగ్‌ ఇటీవల వెలువరించిన నివేదిక... ప్రభుత్వ పెద్దలు బడా వ్యాపారులు, వ్యాపార సంస్థలతో కుమ్మక్కయిన తీరును మరోసారి వెలుగులోకి తెచ్చిందని సిపిఎం పేర్కొంది. ఈ వ్యవహారంలో మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని, నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పున్ణసమీక్షించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. కెజి డి-6 బ్లాక్‌లో రిలయన్స్‌ పలు అవకతవకలకు పాల్పడడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక వెల్లడించినట్లు సిపిఎం తెలిపింది. ముఖ్యంగా పెట్రోలియం లాభాలలో సింహభాగాన్ని డిమాండ్‌ చేసేందుకు వీలుగా రిలయన్స్‌ గ్రూప్‌ పెట్టుబడి వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి చూపటం, రిలయన్స్‌ సంస్థ ఇతర ప్రైవేటు సంస్థలకు ఎటువంటి బిడ్డింగ్‌లు లేకుండానే కాంట్రాక్ట్‌లు అప్పగించటం పెట్టుబడి వ్యయం పెరగటానికి దారి తీసిందని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కేటాయించిన మొత్తం 7,649 చ.కి.మీ అన్వేషిత ప్రాంతంలో కేవలం ఐదుశాతం తమ ఆధీనంలో ఉంచుకోవటానికి బదులు మొత్తం ప్రాంతాన్నే రిలయన్స్‌ తన ఆధీనంలో ఉంచుకోవటం... ఉత్పాదక పంపిణీ ఒప్పందం(పిఎస్‌సి)కి పూర్తి విరుద్ధమని తెలిపింది.

   ఈ బ్లాక్‌కు అంచనా వేసిన పెట్టుబడి వ్యయం 117 శాతం ఎక్కువగా పెరిగినా, ఉత్పాదక సామర్ధ్యంలో ఏ మాత్రమూ
పెంపుదల లేకపోవటాన్ని కాగ్‌ నివేదిక ఎత్తి చూపిందని తెలిపింది. కేవలం సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్ల ఆధారంగా భారీ కొనుగోళ్ల కాంట్రాక్టులను రిలయన్స్‌ దక్కించుకున్న విషయాన్ని కాగ్‌ నివేదిక వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేసింది. దీనివల్ల భారత ప్రభుత్వ పెట్టుబడుల రికవరీకి కూడా భారీగా గండిపడిందని తెలిపింది. 30 కోట్ల డాలర్ల అంచనా వ్యయం ఉన్న కాంట్రాక్ట్‌ను సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్‌ ద్వారా 110 కోట్ల డాలర్లకు పదేళ్లకు అకేర్‌ గ్రూప్‌కు కట్టబెట్టటమే ఇందుకు ఉదాహరణ అని, ఇటువంటి పది సింగిల్‌ పార్టీ బిడ్స్‌లో ఎనిమిది కాంట్రాక్ట్‌లను రిలయన్స్‌ గ్రూపు... అకేర్‌ గ్రూప్‌నకు కట్టబెట్టిందని తెలిపింది. దీనిని సాకుగా చూపి పెట్టుబడి వ్యయ అంచనాలను రిలయన్స్‌ గ్రూపు మూడు రెట్లకు పైగా పెంచేసి ఖజానాకు గండికొట్టే ప్రయత్నం చేసిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
కాగ్‌ నివేదికలో వెలుగు చూసిన మరో ప్రధానాంశం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డిజిహెచ్‌) పెట్రోలియం మంత్రిత్వశాఖలు రిలయన్స్‌తో కుమ్మక్కై మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని డిస్కవరీ (నిక్షేపాలు కనుగొన్న) ప్రాంతంగా ప్రకటించటం. పిఎస్‌సి నిబంధనల ప్రకారం తొలి దశ అన్వేషణ పూర్తయిన వెంటనే రిలయన్స్‌ మొత్తం అన్వేషిత ప్రాంతంలో 25 శాతం ప్రాంతాన్ని, రెండో దశలో 50 శాతం ప్రాంతాన్ని, మూడో దశలో మొత్తం చమురు బావులను అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా రిలయన్స్‌ గ్రూపు ఈ ప్రాంతాల్లో ఏ మాత్రం ఖాళీ చేయకుండా తిష్టవేసుక్కూర్చుని మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలో నే ఉంచుకున్నదని, ఇది పిఎస్‌సి నిబంధనలకు విరుద్ధమని పొలిట్‌బ్యూరో వివరించింది.

    భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్‌ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేయటమే లక్ష్యంగా రూపొందిన కొత్త అన్వేషిత లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) ముఖ్యోద్దేశం కాగా ప్రైవేటు సంస్థలు మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకోవటంతో అది నీరుకారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బావుల నుండి ఉత్పత్తి పెరిగే కొద్దీ రాయల్టీలు పెరగాల్సి ఉండగా పెట్రో లాభాలు మాత్రం నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారయ్యాయని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో వివరించింది. 2009-10లో రూ.5926 కోట్లు ఉన్న లాభాలు, 2010-11 నాటికి రూ.3,610 కోట్లకు పడిపోయిందని తెలిపింది. పిఎస్‌సి నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోనందున ఈ మొత్తం ఒప్పందాలను పున్ణసమీక్షించి సవరించాల్సిన అవసరం ఉందని పొలిట్‌బ్యూరో కేంద్రానికి సూచించింది. ఇదే విధంగా కెయిన్‌ ఎనర్జీ ఆధీనంలోని పన్నాముక్తా చమురు క్షేత్ర నిర్వహణలో కూడా లొసుగులు బయటపడటం ఎన్‌ఇఎల్‌పి అమలుతీరునే ప్రశ్నార్ధకంగా మారుస్తోందని అభిప్రాయపడింది. కాగ్‌ నివేదిక సూచించిన అంశాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి విరుద్ధంగా రిలయన్స్‌ తన అధీనంలో ఉంచుకున్న 95 శాతం అన్వేషణ ప్రాంతాన్ని సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని, రిలయన్స్‌పై పెనాల్టీ విధించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మాజీ డిజిహెచ్‌తోపాటు ఈ ఉదంతంతో సంబంధమున్న ఇతర అధికారులను తక్షణమే ప్రాసిక్యూట్‌ చేయాలని, పెట్రోలియం మంత్రిత్వ శాఖ పాత్రనూ విచారించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఇలాంటి దుర్వినియోగాలను నివారించడానికి వీలుగా హైడ్రోకార్బన్‌ ఉత్పత్తి పంపిణీ ఒప్పందాల్లో మార్పులు తేవాలని, నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి)ని పున్ణసమీక్షించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

No comments:

Post a Comment