Thursday, July 21, 2011

సూత్రబద్ధ వైఖరితో ప్రజల పక్షాన నిలబడ్డ సిపిఎం


రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వందమంది శాసన సభ్యులతో సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు సమర్పించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీర్ఘకాలంగా మగ్గుతున్న తెలంగాణా సమస్యను పరిష్కరించటంలో కేంద్ర ప్రభుత్వ నాన్చుడు వైఖరి, కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశవాద వైఖరి ప్రస్తుత దుస్థితికి కారణం. పరస్పర విరుద్ధ్ద ప్రకటనలతో జనాన్ని గందరగోళపరచింది వారే. శ్రీకృష్ణకమిటీని నియమించింది వారే. తదనంతరం దానిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ కాలయాపన చేసిందీ వారే. ఆ పేరుతో రాజీనామాలకు తెరతీసిందీ వారే. దీనితో సమస్య మరింత జటిలం అయింది. ఇప్పటికైనా ఈ సమస్యను జాగు చేయకుండా పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులను పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రానిదే.
రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులపై ఆందోళనాకారులు అనేకచోట్ల వత్తిళ్లు తెస్తున్నారు. యంఐయం, లోకసత్తా, సిపియం పార్టీలు తమ అభిప్రాయాలకనుగుణంగా రాజీనామాలు చేయలేదు. కొంతమంది కాంగ్రెసువారు కూడా రాజీనామాలు చేయలేదు. అందులో ఎక్కువమంది హైదరాబాద్‌ నగరానికి చెందినవారే. తమ నియోజకవర్గాల ప్రజల మనోభావాలకనుగుణంగానే తామీ నిర్ణయం తీసుకున్నామని వారంటున్నారు. సిపిఎం శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి కూడా రాజీనామా చేయాలని ఆయన ఇంటి ముందు ఎబివిపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయం ముందు కూడా కొంతమంది ధర్నా చేశారు. భువనగిరి కార్యాలయానికి నిప్పంటించారు. ఇంకా అక్కడా ఇక్కడా దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. నిరసనకు గురికావాల్సినంత రాజకీయ, నైతిక తప్పులేవీ సిపిఎం చేయలేదు. రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత కూడా సిపియంపై లేదు. సిపిఎం పార్టీ గాని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కాని తాము ప్రత్యేక తెలంగాణ తెస్తామని ఏనాడూ ప్రజలకి వాగ్దానం చేయలేదు. ఆ పేరుతో ఓట్లడిగి మోసమూ చేయలేదు. తన వైఖరిని నిజాయితీగా ప్రజలకి చెప్పి గెలుపైనా, ఓటమైనా ఒకే స్ఫూర్తితో స్వీకరించింది. ప్రత్యేక తెలంగాణ తెస్తామని ప్రజల్ని మురిపించి, హామీలిచ్చి, వాగ్దానాలు చేసినవారే ప్రజలకు ఈ విషయంపై జవాబు చెప్పుకోవాలి. అలాంటి కొంతమంది నేడు రాజీనామాలకి పూనుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌లోనే అంతర్గత విబేధాలున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. సమస్యకు మూలమైన కేంద్ర, రాష్ట్ర పాలకుల్ని వదిలి ప్రతిపక్ష పార్టీలపైన, అందునా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం లాంటి పార్టీలపై దాడులకు పూనుకోవడం సమంజసం కాదు. ఆందోళనకారుల మనోభావాలను రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కొంతమంది పనిగట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో అసలు దోషులెవరో ప్రజలు గుర్తించాలి.
ప్రత్యేక తెలంగాణ విషయంలో సిపిఎంకు, ఇతర పార్టీలకు విబేధాలున్నమాట వాస్తవం. అంతమాత్రాన ప్రత్యేక తెలంగాణ కోరుతున్న కాంగ్రేసేతర లౌకిక పార్టీలను సిపిఎం తన శత్రువులుగా భావించడం లేదు. సమస్యతో విభేదించినా ఆందోళనాకారులపై సాగే నిర్బంధకాండను ప్రజాస్వామిక స్పూర్తితో ఖండిస్తూ వస్తోంది. పైగా ప్రజల రోజువారీ సమస్యలపై ఆయా పార్టీలతో కలిసి పనిచేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో వామపక్షాలు అనేక సమస్యలపై ఉమ్మడి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో సైతం లౌకికపార్టీలు సహకరించుకొని పనిచేశాయి. వామపక్షాలపై ఆధారపడి వున్న యుపిఎ – 1 హయాంలో సిపిఎంపై నెపం నెట్టి కాంగ్రెస్‌ తప్పించుకొనే యత్నం చేసింది. కాంగ్రెస్‌ దుష్టాలోచనను ఆనాడే సిపియం ప్రశ్నించి నిలదీసింది. దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చి పెట్టే అణు ఒప్పందాన్ని సైతం వామపక్షాలను ఖాతరు చేయకుండా ఆమోదింపజేసుకొన్న ఘనత కాంగ్రెసుది. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను సిపిఎం వ్యతిరేకించినా పునరుద్ధరించిన విషయాన్ని ఆనాడే రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం లేదని చిదంబరం అంటున్నారు. కాంగ్రెసు తన అంతర్గత సంక్షోభాన్ని రాష్ట్రప్రజలపై రుద్దుతున్నదనేది స్పష్టం. ఇప్పుడు కాంగ్రెస్‌ తప్పుడు విధానాలను ప్రజలు గుర్తించడంతో బోనులో నిలబడక తప్పలేదు. తమ పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఇతర పార్టీలపైన, తమ పార్టీలోనే ముఠాల మధ్య దాడులకు పాల్పడుతున్నది. ఇరు ప్రాంతాల నాయకులు పరస్పరం దూషించుకోవడం, అడ్డసవాళ్లు విసురుకోవడంతోనే ఆగకుండా ఇరు ప్రాంతాల ప్రజల మధ్యా విద్వేషాలు రాజేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇరు ప్రాంతాల ప్రజలు, ఆందోళనాకారులు వీరి ఉచ్చులో ఇరుక్కోకుండా కేంద్ర ప్రభుత్వ అస్పష్ట వైఖరిని నిలదీసి తేల్చుకోవాలి.
పనిలో పనిగా కొంతమంది తమ రాజకీయ పరపతిని పెంచుకోవడానికి ప్రత్యర్థులపై దాడులు చేయడానికి ఉద్యమాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారు. ఎవరు ఎవరిపై భౌతికదాడులకు పాల్పడ్డా అది సమర్థనీయం కాదు. దానితో ఏ సమస్యా పరిష్కారం కాదు పరస్పర ద్వేషాలు పెరగడం తప్ప. దురదృష్టవశాత్తు వామపక్షాల మధ్య ఈ సమస్యపై వచ్చిన తేడాలు కూడా దీనికి ఒక కారణమౌతున్నాయి. ఒకే ఉద్యమ లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీల మధ్య తాత్కాలిక ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే భవిష్యత్‌ వామపక్ష ఉద్యమ పురోగమనానికే అది ఆటంకమవుతుందని గుర్తించాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మతోన్మాదశక్తులు పేట్రేగిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు బలపడితే వచ్చే ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణాను దోచుకుంటున్నారని, వారితోనే తమకు పేచీ అని ప్రత్యేక తెలంగాణావాదులంటున్నారు. ఈ పెట్టుబడిదారులకు సిపియం ప్రాతినిధ్యం వహిస్తున్నదా? కాదని అందరికీ తెలుసు. ఏ పార్టీలు ఈ వర్గాలను మోస్తున్నాయో కూడా తెలుసు. పైగా అది రోజూ పోరాడేది ఇలాంటి వర్గాలకు వ్యతిరేకంగానే. ఇలాంటి పార్టీపై దాడి ఎవరికి మేలు చేస్తుంది? ఈ పెట్టుబడిదారులు తెలంగాణా ప్రజల్నే కాదు కోస్తా సీమ ప్రజల్ని కూడా దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారులకు ప్రాంతం, కులం, మతం ఉండవు. తెలంగాణాతో సహా రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారులే కాదు వివిధ దేశాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ప్రపంచీకరణ పేరుతో దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలను తరలించుకుపోతోంది ఎవరు? ఏ ప్రాంతం వారు? ఇలాంటి బడా కార్పోరేట్‌ శక్తులకు లాభమే పరమావధి. లాభం కోసం ఎక్కడికైనా పోతారు. ఎవరినైనా దోపిడీ చేస్తారు. అలాంటి వర్గాలకు వ్యతిరేకంగా ఒక ప్రాంతం ప్రజలే కాదు అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ సమైక్యమై పోరాడాలని సిపియం చెపుతోంది. ప్రజలు విడిపోతే బలపడేది పెట్టుబడిదారీ వర్గాలే. నిజంగా పెట్టుబడిదారులపై ద్వేషమే ఉంటే వారి దోపిడీకి గురయ్యే అన్ని ప్రాంతాల ప్రజల్ని ఐక్యం చేసి పోరాడాలి. అదే పని సిపియం చేస్తోంది.
ప్రత్యక రాష్ట్రం కోసం తెలంగాణాలోనూ, సమైక్యత కోసం సీమాంధ్రలోనూ ప్రజల మనోభావాలు బలంగా ఉన్నాయి. వీటిని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వారు ఎక్కడ తాళం అక్కడ వేస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఒకే వైఖరి కలిగివున్నది సిపిఎం. అదే సమయంలో ప్రజల మనోభావాలతో ఏ ప్రాంతంలోనూ చెలగాటమాడటం లేదు. ఏ ఉద్యమంలోనూ భాగస్వామి కాలేదు. రెండు ప్రాంతాల్లోనూ ప్రజల రోజువారీ సమస్యలపై ఐక్యం చేయడానికి, కదిలించడానికి ప్రయత్నిస్తున్నది. పదవుల కోసం పాకులాడడం సిపియం నైజానికి విరుద్ధం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడమే సిపిఎం విధానం. పదవులు పోరాటసాధనమే తప్ప అలంకారం కాదు. ప్రధాని పదవినే తృణప్రాయంగా ఎంచి కాలదన్నిన చరిత్ర సిపియంది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ జీతభత్యాలను సైతం పార్టీకే సమర్పిస్తున్నారు. అవినీతికి పాల్పడేవారిని సిపిఎం సహించదు. నిస్వార్దంగా ప్రజలకు సేవ చేయడమే సిపిఎం కార్యకర్తలకు తెలిసిన విద్య. ఈ క్రమంలో పాలకుల దాష్టీకానికి, దౌర్జన్యాలకు కార్యకర్తలు గురవుతున్నారు. ప్రజల కోసం లాఠీ దెబ్బలు తినడం, కేసులు ఎదుర్కోవడం, జైళ్లకు పోవడానికి సిపిఎం కార్యకర్తలు అలవాటుపడ్డారు. ప్రజల కోసం త్యాగం చేయడంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు ముందుంటారన్న విషయం అందరూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా వాదులు సైతం సిపియం నిబద్దతను గౌరవిస్తున్నారు. ఇలాంటి పార్టీ ప్రజాప్రతినిధులపై, కార్యాలయాలపై కొంతమంది దాడులకి దిగటం అమానుషమే కాదు అన్యాయం కూడా.
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర త్యాగాలతో పునీతమైనది. వీర తెలంగాణ విప్లవ పోరాటం మొదలు పున్నప్రవాయలార్‌, తెభాగ, వర్లి వంటి అనేక పోరాటాల్లో ఎర్రజెండా రాటుతేలింది. దేశ సమైక్యత కోసం పంజాబ్‌, అస్సాం లాంటి చోట్ల ప్రాణాలు సైతం అర్పించింది. నేడు జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదుల దాడులను ఎదిరించి నిలబడ్డ పార్టీ సిపిఎం. నిన్నటివరకు అధికారంలో వున్న బెంగాల్‌, కేరళ నేడు పాలిస్తున్న త్రిపురలలో సైతం ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని ఎదిరించి దేశ సమైక్యతను, లౌకికతత్వాన్ని కాపాడుతున్నది వామపక్షాలే. తెలంగాణాపై సిపియం వైఖరి సిద్దాంతపరమైందే తప్ప ప్రాంతీయపరమైంది కాదు. ఇది జాతీయ విధానంలో భాగం. సిపిఎం సూత్రబద్ధ వైఖరిని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ దుష్టతలంపుతో ప్రజలను తప్పుదారి పట్టించే వారి వలలో పడితే బలహీనపడేది ప్రజలకోసం పోరాడే పార్టీలే. తాత్కాలికావేశంలో అలాంటి పార్టీలను బలహీనపరచుకుంటే రేపు మన హక్కుల కోసం పోరాడేవారే కరువవుతారు.
-అరుణతార

No comments:

Post a Comment