Friday, July 22, 2011

ప్రపంచ ప్రజలు పనిచేస్తుంటే అమెరికా కడుపు నింపుకుంటోంది


  • సంక్షోభం నుండి బయటపడడం సులభం కాదు
  • జాతి వివక్ష కొనసాగుతోంది
  • తన యుఎస్‌ పర్యటన వివరాలను వెల్లడించిన రాఘవులు
ప్రపంచ దేశాలన్నీ పనిచేసిపెడుతుంటే అమెరికా తన కడుపు నింపుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. అమెరికాలో తలెత్తిన సంక్షోభం నుండి ఆ దేశం బయటపడటం అంత సులభమేమీ కాదన్న విషయం తమ పర్యటన ద్వారా తెలుసుకున్నామని ఆయన చెప్పారు. అక్కడ జాతి వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. తన వనరులన్నింటినీ ఆదా చేసుకున్న అమెరికా ప్రపంచ సంపదనంతా పోగేసి తమ పౌరుల జీవన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరించిందనే విషయం అవగతమైందన్నారు. తన 20 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న రాఘవులు గురువారం స్థానిక ఎంబి భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన అమెరికా పర్యటన అనుభవాలను పంచుకున్నారు. అమెరికాలో తాను పర్యటించిన వివిధ దర్శనీయ, పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ప్రజల జీవన స్థితిగతులు, ఉద్యోగుల స్థితిగతులు, వివిధ రంగాల్లో పనిచేసే వారి అనుభవాలు, ప్రభుత్వ, ప్రయివేటురంగ సంస్థల పనితీరు, ట్రాఫిక్‌ నిబంధనలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు, చట్టాలు, విద్య, వైద్యరంగాల్లో ప్రజలకందుతున్న సేవలు తదితర అంశాల గురించి విపులీకరించారు. ఆ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

మనదేశ పౌరులు అమెరికా గొప్ప దేశం అంటూ పొగుడుతుంటారు. ఆ దేశంలోని పౌరుల జీవన ప్రమాణాలతో మన ప్రమాణాలను పోల్చుకుని ఆత్మ నూన్యతకు గురవుతుంటారు. అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మన దేశంతో పోల్చిచూస్తే చాలా మెరుగైన స్థితిలో ఉన్న మాట వాస్తవమే. అక్కడ అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు కనీస వేతనం గంటకు 8 నుండి 10 డాలర్ల వరకు(ఒక డాలర్‌ 45 రూపాయలతో సమానం) ఉంటుంది. అదే స్కిల్డ్‌ పర్సన్స్‌కు అయితే గంటకు 14 నుండి 39 డాలర్ల వేతనముంటుంది. అంటే 8 గంటల పనివిధానం ప్రకారం అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు రోజుకు గరిష్టంగా రూ. 3,600, స్కిల్డ్‌ పర్సన్‌కు గరిష్టంగా రూ. 6,300 వేతనమిస్తారు. ఇల్లు లేనివారికి ప్రభుత్వమే సామూహిక గృహాల్ని కట్టించి ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ గృహాల్లోకి వెళ్ళేందుకు నిరాకరిస్తే బలవంతంగానైనా వారిని ఆ ఇళ్ళలోకి పంపిస్తారు. ఇళ్ళన్నీ కర్ర, కలపతోనే నిర్మిస్తారు. అందువల్ల ఏ గదిలోనైనా కుళాయి ద్వారా నీటిని లీక్‌ కాకుండా చూసుకోవాలి. శబ్దం చేయకుండా నడవాలి. ఇళ్ళల్లో సిగిరెట్లు తాగితే అవి తగలబడే ప్రమాదముంది కాబట్టి ఆరుబయటే వాటిని కాల్చాలి. గతంలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ముందస్తు చెల్లింపులూ లేకుండా రుణమిచ్చేవారు. ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం 10 శాతం డబ్బును చెల్లిస్తేనే రుణ సదుపాయం కల్పిస్తున్నారు. అమెరికాలో బ్రిటీష్‌ పద్ధతులన్నింటినీ వ్యతిరేకిస్తారు. మన దగ్గర దూరాన్ని కిలోమీటర్ల రూపంలో లెక్కిస్తే అమెరికన్స్‌ మైళ్ళ రూపంలో లెక్కిస్తారు. వాహనాలకు కుడివైపునే స్టీరింగ్‌ ఉంటుంది.

అక్కడి జనాలు రోడ్డుకి కుడివైపునే నడుస్తారు. అమెరికాలో పాఠశాల విధానం చాలా బాగుంది. పన్నెండో తరగతి వరకు అందరికీ ఉచిత విద్యనందిస్తారు. పిల్లలకు తిండి దగ్గర్నుండి పాఠ్య పుస్తకాల వరకూ అన్నీ ఉచితంగా అందిస్తారు. పన్నెండో తరగతి తర్వాత కేవలం ఉపాధిని చూపించే విద్యనే అందిస్తారు. ఇవిగాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలంటే మాత్రం డబ్బు వెచ్చించాల్సిందే. ఇది అక్కడి పేదవాడికి పెనుభారంగా మారింది. వైద్యం విషయానికొస్తే ప్రభుత్వ, ప్రయివేటు, ట్రస్టు ఆస్పత్రులన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే మాత్రం కచ్చితంగా 'ఆరోగ్య బీమా' చేసుండాల్సిందే. ఈ బీమా చేయించుకోకపోతే ఎంత పేదోడైనా డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిందే. కేవలం మరణం సంభవిస్తుందనుకున్న సమయంలో మాత్రమే బీమా లేనివారికి ఉచిత వైద్యాన్నందిస్తారు. మిగతా అన్ని సమయాల్లోనూ కచ్చితంగా డబ్బు వెచ్చించాల్సిందే. అమెరికా మొత్తం జనాభా 31 కోట్లు. వీరిలో 30 లక్షల మంది ఆరోగ్య బీమా చేయించలేదు. మరోవైపు ఆరోగ్య బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు ఏడాదికేడాది పెంచేస్తుండటంతో సంపన్నులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫాస్ట్‌ఫుడ్‌ చాలా చీప్‌. అదే రెస్టారెంట్‌లో అయితే మనం భరించలేనంత ఖరీదుంటుంది. అక్కడి ట్రాఫిక్‌ విధానం చాలా పద్ధతిగా, నిబంధనలు కఠినంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ వాహనదారులెవరైనా రెడ్‌ సిగల్‌ను దాటితే 45 డాలర్లు జరిమానాగా విధిస్తారు. ఈ విధంగా మూడుసార్లు జరిగితే వాహనదారుడి లైసెన్సును రద్దు చేస్తారు. అక్కడ వాహనాలకు కూడా బీమా చేయిస్తారు. వాహనదారుడెవరైనా మాటిమాటికీ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రమాదాలు చేస్తుంటే అతని వాహన బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు పెంచుతాయి. ఇన్ని కఠిన నిబంధనలు ఉన్నందువల్లే అక్కడి పౌరులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారు. 'మా దగ్గర జీతాలెక్కువగా ఉంటాయి కాబట్టి అవినీతి తక్కువగా ఉంటుంది' అని అక్కడి పౌరులు చెప్పారు. అయితే ఉన్నతస్థాయిలో అవినీతి ఉన్న విషయాన్ని మేం గుర్తించాం. ఈ విధంగా అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పటికీ వారు కూడా కొన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతి వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. నల్లజాతివారు ఒక దగ్గర, ఆసియన్లు మరో దగ్గర, తెల్లజాతివారు ఇంకో దగ్గర నివసిస్తుంటారు. నల్లజాతివారు లేదా ఆసియన్లు తమ ప్రాంతాల వద్దకొచ్చి నివాసాలేర్పర్చుకుంటే తెల్లజాతివారు ఆ ప్రదేశాలను ఖాళీ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి పౌరులు, ఇతర దేశాల నుండి ఉద్యోగార్థం వెళ్ళిన వారు(వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు) అభద్రతాభావానికి గురవుతున్నారు. ప్రస్తుతం డాలర్‌ ప్రింటింగ్‌ మీదనే ఆధారపడి ఆ దేశం బతుకుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ డాలర్‌ చెలామణిలో ఉండటమే దీనికి కారణం. ఒకవేళ ఇతర దేశాల మీద డాలర్‌ పెత్తనం పడిపోతే అమెరికా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ పనిచేసి పెడుతుంటే... అమెరికా తన కడుపు నింపుకుంటోంది. అమెరికాకు వెళ్ళకముందు మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి ఆదేశం ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతుందని భావించాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అమెరికాకు వెళ్ళి చూసిన తర్వాత సంక్షోభం నుండి అది గట్టెక్కటం అంత సులభమేమీ కాదనే విషయం స్పష్టమైంది.

No comments:

Post a Comment