Saturday, July 23, 2011

ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న రైతాంగం


రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రంపాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు గ్యారెంటీ కల్పించవచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి.ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు.
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా నేటికీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. 2011 ఖరీఫ్‌ పంటల సాగుకు సిద్ధమైన రైతు 13 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల (20-07-2011 నాటికి) విత్తనం వేయని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేటికి 40 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి వుండగా 30 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వేసిన పంటల్లో వర్షాభావం కారణంగా 50శాతం పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి రెండోసారి ఎరువులు, విత్తనం కొరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. బ్లాక్‌మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేసే పరిస్థితి చిన్న సన్నకారు రైతులకు, కౌల్దారులకు లేదు. రాష్ట్రంలో రైతు కరువులు వరదలతో సహజీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువులు, వరదల నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి పథకాలను రూపొందించలేదు. కనీసం తాత్కాలికంగానైనా కంటెంజెన్సీ పథకాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ చొరవచూపట్లేేదు. ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖకు పూర్తి బాధ్యతగల మంత్రి లేకపోవడం శోచనీయం. 2010-11లో 15 జిల్లాల్లో 669 మండలాల్లో 27 లక్షల ఎకరాల్లోని పంటలు అతివృష్టి వల్ల దెబ్బతిని 12 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే అంచనా వేసింది. వాస్తవానికి ఈ అంచనాలు ప్రాథమికమైనవే. వాస్తవ అంచనాలు ఇంతకుమించి వుంటాయి. కేంద్రాన్ని రు.9,373 కోట్ల సాయం కోరగా కేవలం రు. 481 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రధాని స్వయంగా ప్రకటించిన రు. 1000 కోట్లలో సగం మాత్రమే రాష్ట్రానికి చేరింది. రాష్ట్రం మరో రు. 500 కోట్లు తన బడ్జెట్‌నుంచి ఇచ్చింది. జరిగిన నష్టానికి ప్రభుత్వాలు అందించిన సహకారానికి మధ్య హస్తిమశకాంతరం వుంది.
వర్షాభావ పరిస్థితుల గణాంకాల సేకరణ కూడా అశాస్త్రీయంగానేవుంది. 750 మి.మీ. లోపు వర్షపాతం గల ప్రాంతాల్లో 2.5 మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. 750 మి.మీ.కు పైన వర్షపాతంగల ప్రాంతాల్లో 5మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. మాసంలో నిర్ణయించబడిన సాధారణ వర్షపాతం ఒకేరోజు పడి మిగతా రోజుల్లో డ్రైస్పెల్‌ (వర్షాలు లేకపోవడం)గా వున్నప్పటికీ వర్షాలు సక్రమంగా పడినట్లు గుర్తిస్తారు. వాస్తవానికి నెలలో పదిరోజుల తేడాతో మూడుసార్లు వర్షం పడినట్లయితే పంటలు నష్టం వాటిల్లదు. కానీ ఒకేరోజు 10 సెం.మీ. వర్షం పడి ఆ తర్వాత నెల రోజుల వరకు వర్షం పడనప్పటికీ నేటి వాతావరణ పరిస్థితుల జాబితాలో సక్రమంగా వర్షాలు పడినట్లు నమోదు చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతిని సవరించి ప్రస్తుత పంటల రక్షణ దృష్ట్యా వర్షాభావ పరిస్థితులను అంచనా వేయాలి. మరో 15 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్‌ మెట్టపంటల సీజన్‌ దాటిపోతుంది. ఇప్పటికే పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో 8.17 లక్షల హెక్టార్లు వేయాల్సివుండగా నేటికి 3.77లక్షల హెక్టార్లు మాత్రమే వేశారు. నూనెగింజలు 17.74 లక్షలు వేయాల్సి వుండగా, 7.05 లక్షల హెక్టార్లు వేశారు. గత సంవత్సరం ఇదేరోజున వేసిన విత్తన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ 15 నుండి జూలై 15లోపు వేసిన పంటలు మాత్రమే మంచి ఫలితాన్నిస్తాయి. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వేసిన పంటల దిగుబడి 50శాతం తగ్గుతుంది. పెట్టుబడి మాత్రం రెండు సందర్భాల్లో వ్యవసాయ పెట్టుబడిలో మాత్రం మార్పువుండదు. వర్షాభావ పరిస్థితులను సక్రమమైన అంచనా వేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కంటెంజెన్సీ పథకాన్ని (అత్యవసర పథకం) నిర్ణయించి అమలుచేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. 1956 నుండి పరిశీలిస్తే వ్యవసాయ శాఖ ఈ ప్రత్యేక పథకాన్ని రచించి అమలుజరిపిన దాఖలాలు లేవు. ఖరీఫ్‌ పథకాన్నే సెప్టెంబర్‌ 30 వరకు అమలుచేస్తున్నారు. 2011-12 సంవత్సరానికి జూలై 1న వ్యవసాయ శాఖ ప్రణాళిక విడుదల చేస్తూ 223 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రకటించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయా?
2009-10లో వర్షాభావ పరిస్థితుల వలన 981 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ అందించిన సాయం నామమాత్రంగా కూడాలేదు. గత ఏడు సంవత్సరాలు ప్రకృతివైపరీత్యాల వల్ల జరిగిన నష్టపరిహారం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని రు. 42,533.49 కోట్లు కోరగా, చేసిన సహాయం 1994.31 కోట్లు మాత్రమే. రాష్ట్ర వ్యవసాయ సాగును పరిశీలిస్తే కరువులు, వరదలు లేని సంవత్సరం లేదంటే అతిశయోక్తి కాదు. కరువులు, వరదల నష్టాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన 28 కమీషన్లు (1956 నుండి ) చేసిన సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. పైగా, జాతీయ విపత్తుల నివారణా కమిటి ఏర్పాటు చేసి దానికి ఉపాధ్యక్షునిగా రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులొకరు కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ కమీషను వాస్తవ పరిశీలనలు చేసిన దాఖలాల్లేవు. ఆ కమిషన్‌ ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయి. కేంద్ర బృందాలను ఆహ్వానించడం, వారు సమాచారాన్ని సేకరించుకొని వెళ్ళడం ప్రతియేటా జరుగుతున్న తతంగమే.
వాతావరణం అనుకూలించి పంటలు పండితే ప్రభుత్వం తన విధానాల ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని చెప్పుకుంటోంది. వాతావరణం అనుకూలించకపోతే ప్రకృతిపైకి నెట్టివేసి ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకొంటున్నది. ప్రకృతివైపరీత్యాలను తట్టుకొనే విత్తనాలను కనుగొని రైతులకు అందించడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం నూతన పరిశోధనలకు నిధుల కేటాయింపుల కోతపెట్టింది. చివరికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధనా కేంద్రాలన్నీ మూతవేశారు. వేల ఎకరాల విస్తీర్ణంలో గల ''ఇక్రిశాట్‌'' పరిశోధనల ఫలితాలు రాష్ట్ర రైతాంగానికి అందడంలేదు. ఇక్కడ జరుగుతున్న పరిశోధనల ఫలితాలు ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండ దేశాలకు పంపించి లాభాలు గడిస్తున్నారు. నేడు ప్రకృతిలో వస్తున్న మార్పుల ఫలితంగా (గ్లోబల్‌ వార్మింగ్‌) భూమి వేడెక్కి రుతువుల క్రమాన్ని మార్చివేసింది. ధనిక దేశాలు కార్బన్‌డయాక్సైడ్‌ను విపరీతంగా విడుదల చేస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఆ దేశాలు పేద దేశాలకు కార్బన్‌ రుణాలు (అడవుల పెంపకం) ఇచ్చి అడవులు పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఒత్తిడితెస్తున్నాయి. కానీ, తాము విడుదల చేస్తున్న ప్రమాదకరమైన కలుషితాలను మాత్రం తగ్గించుకోవడానికి నిరాకరిస్తున్నాయి.దీనివల్ల రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అందుకే దీనిని ధనిక దేశాల పాపం అని చెప్పాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించడానికి తగిన ఏర్పాట్లను మన ప్రభుత్వాలు చేపట్టాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం మానేశాయి. ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలే శిరోధార్యంగా అమలుచేస్తున్నాయి. ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించాలని, ధనిక దేశాలనుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశాలు తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి మన వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆహారేతర పంటలు (ప్లాంటేషన్‌ పంటలు) వేశారు. మరో కోటి ఎకరాలు సాగుచేయకుండా బీడు భూములుగా వదిలేశారు. మొత్తం 3.50కోట్ల ఎకరాలు సాగుకు వినియోగంగా వుండగా, యిందులో 50శాతం మాత్రమే పంటలు వేస్తున్నారు. కనీసం ఈ పంటలనైనా కాపాడాలన్న లక్ష్యశుద్ధి ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగ రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో వుంది. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. నేడు అభివృద్ధి అయిన టెక్నాలజీని వినియోగించి మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించి పంటలను రక్షించవచ్చు. మేఘమథన టెక్నాలజీని వినియోగించాలంటే సొంత రాడార్లు, విమానాలు వుండాలి. కానీ, రాడార్ల కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తున్నది. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా వర్షాలు పడకుండా మేఘాలను తరిమివేయడానికి ఈ టెక్నాలజీని వినియోగించారు. చైనాలో ఒలింపిక్స్‌ క్రీడల సందర్భంగా కూడా వర్షాలు రాకుండా నివారించారు. మన రాష్ట్రంలో మేఘమథనం బడ్జెట్‌ కింద కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితం శూన్యం. వర్షం పడుతున్నప్పుడే అందులోనే మేఘమథనం చేశామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రం పాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు హామీ ఇవ్వొచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి. ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు. రాష్ట్రంలోని చెరువులు గొలుసుకట్టుగా వుండడం వల్ల నీరు వృధాకాకుండా రక్షించే చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని 74వేల చెరువు, కుంటలను మంచినీటి వనరులుగా తీర్చిదిద్దడంలో చిన్న నీటివనరుల శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. దాదాపు 15వేల చెరువులు నీటిని నిల్వపెట్టగల స్థితిలో లేవు. ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు ఇచ్చే రుణసాయాన్ని ఉపయోగించి మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల వ్యయ అంచనా పెరుగుతున్నది.
ఇటువంటి వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కంటెంజెన్సీ పథకాన్ని ఏర్పాటుచేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాలను ఆవిష్కరించాలి. వర్షపాత వివరాలను సేకరించే విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించాలి. మేఘమథనం ద్వారా పంటలను రక్షించాలి. ప్రాజెక్టుల నీటిద్వారా చెరువు, కుంటలను నింపి భూగర్భ జలాలను పెంపొందించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కిందగల ఆయకట్టును ఆ శాఖే నిర్వహించాలి. పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండోసారి పంటవేయడానికి విత్తనాలు, ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
-సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment