Thursday, July 21, 2011

పటిష్ట లోక్‌పాల్‌ అవశ్యం

    లోక్‌పాల్‌ పరిధి, అది నిర్వహించాల్సిన పాత్రపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి ప్రధాన అంశాలపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) తన వైఖరిని స్పష్టం చేస్తూ సవివరమైన పత్రాన్ని విడుదల చేసింది.
   గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా బయల్పడిన కుంభకోణాల నేపథ్యంలో అవినీతి ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇప్పటికీ లక్షలాది మంది దుర్భర పేదరికంలో మగ్గుతూ, ఆకలితో అలమటిస్తూ సామాజిక, ఆర్థిక అవకాశాలకు దూరమై జీవితాలు వెళ్లదీస్తున్న భారత్‌ వంటి నిరుపేద దేశాల్లో అవినీతి చర్యల ద్వారా ప్రజావనరులను కైంకర్యం చెయ్యడం తీవ్రమైన నేరం. అవినీతి అభివృద్ధికి ప్రతిబంధకం మాత్రమే కాదు. అవినీతి ద్వారా సంపాదించిన అక్రమార్జన మన సమాజంలో అసమానతలను పెంచుతోంది. మన సామాజిక వ్యవస్థను చెరచివేస్తోంది.
ఇటీవల వెలుగుచూసిన 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు, కామన్వెల్త్‌ గేమ్స్‌ మొదలైన కుంభకోణాలు వేలాది కోట్ల రూపాయల ప్రజా వనరులను ఒక వర్గం కార్పొరేట్స్‌, బ్యూరోక్రాట్లు, మంత్రులు ఏ విధంగా కొల్లగొట్టారో బట్టబయలు చేశాయి. నేరాలకు పాల్పడిన మంత్రులను నెలల తరబడి అధికారంలో కొనసాగించి దర్యాప్తులను భ్రష్టుపట్టించి న్యాయాన్ని అటకాయించడం మరీ ఘోరమైన విషయం. ఉన్నత స్థాయిలో అవినీతి మన రాజకీయ వ్యవస్థలో అనేక దశాబ్దాలుగా సర్వసాధారణ విషయంగా పరిణమించింది. సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టిన తరువాత విధాన నిర్ణాయక ప్రక్రియ పూర్తిగా భ్రష్టుపట్టింది. నయా ఉదారవాద వ్యవస్థలో బడా కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల మధ్య అక్రమ సంబంధాల కారణంగా మరింతగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదంలో పడింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అనర్హులను అందలం ఎక్కించి నేరాలను ప్రోత్సహించేదిగా ఉంది. రాజకీయ, న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే అవినీతిపై పోరాటం విజయవంతమవుతుంది. ఒకేఒక చర్య లేదా అరకొర చర్యలతో ఇది సాధ్యం కాదు.. పటిష్టమైన లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం ఇప్పుడు చేపట్టాల్సిన చర్యల్లో ఒకటి. ఇందుకు అనుబంధంగా ఇతర చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. చట్టపరంగా పౌరుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఉన్నత న్యాయవ్యవస్థ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చెయ్యాలి. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టాలి. లోపాలను చక్కదిద్ది నల్లధనాన్ని వెలికితీసేందుకు సత్వర ప్రాతిపదికపై పన్నుల వ్యవస్థను సంస్కరించాలి. నల్లధనంలో అధికభాగం విదేశాల్లో, పన్నులు సరళంగా ఉండే దేశాల్లోని బ్యాంకుల ఖాతాల రూపంలో ఉంటాయి. వ్యాపార, రాజకీయ, బ్యూరోక్రాట్ల మధ్య రహస్య సంబంధాలను అంతమొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. సమగ్ర సంస్కరణలు తీసుకురావడం ద్వారా మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుంది.
లోక్‌పాల్‌ బిల్లు
   స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమలులో ఉంది. అవినీతి, అధికార దుర్వినియోగం కారణంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఈ వ్యవస్థ అవకాశం కల్పించింది. నాలుగు దశాబ్దాలపాటు లోక్‌పాల్‌ బిల్లు భారత పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేకపోయింది. అవినీతిపై పోరాడడంలో రాజకీయ చిత్తశుద్ధిలేకపోవడమే ఇందుకు కారణం. గతంలో అనేకసార్లు ప్రభుత్వాలు లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించాయి. అయితే వేర్వేరు కారణాలతో ఇవి వెనక్కుపోయాయి. ఈ బిల్లుపై చర్చను ప్రారంభించేందుకు ప్రస్తుత యుపిఎ-2 ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదురైంది. అవినీతి కుంభకోణాలు వరుసగా బయల్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో అనివార్యంగా అవినీతిపై చర్చలు ప్రారంభించడం ప్రభుత్వానికి అనివార్యమైంది. ఉన్నత స్థానాల్లో అవినీతిపై విచారణ జరిపే లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలి.
లోక్‌పాల్‌ పరిధి, అది నిర్వహించాల్సిన పాత్రపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి ప్రధాన అంశాలపై భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్టు) తన వైఖరిని స్పష్టం చేయాలని భావిస్తోంది.
1.అవినీతికి నిర్వచనం
    లంచం తీసుకోవడం, ఇతరులను ప్రభావితులను చేసి తమకు అనుకూలంగా మలచుకోవడం, ఆశ్రితపక్షపాతం, అనర్హులను అందలం ఎక్కించడం, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం, అధికారులకు ముడుపులు చెల్లించడం, నేరాల్లో భాగస్వామ్యం వహించడం అవినీతిలో అంతర్భాగాలు.
1988 అవినీతి నిరోధక చట్టం ఏయే నేరాలు అవినీతి కిందకు వస్తాయో నిర్వచించింది. ఈ నిర్వచనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత లాభం కోసం లేదా ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడతారని భావించడం అవినీతిపై పరిమిత అవగాహన మాత్రమే కల్పిస్తుంది. అనేక సందర్భాల్లో ఒక ప్రయివేటు కంపెనీకి లాభం చేకూర్చేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. 1988 అవినీతి నిరోధక వ్యక్తి అనే పదానికి ఇచ్చిన నిర్వచనం పరిధిలోకి ఈ కంపెనీ రాదు. అనేక సందర్భాల్లో ముడుపులు, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడం, నిగ్గు తేల్చడం అత్యంత కష్టమవుతుంది. అయితే కోశాగారానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఉదాహరణకు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ సంస్థలను (పిఎస్‌యు) విక్రయించడం.
    ఏదేనీ వ్యక్తికి లేదా సంస్థకు ఉద్దేశపూర్వకంగా అక్రమమైన మార్గంలో లాభం లేదా అక్రమంగాలబ్ధి చేకూర్చడం లేదా ఏదేనీ ప్రభుత్యోద్యోగి లేదా ప్రజా సేవకుడి నుండి చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లబ్ధి పొందడాన్ని కూడా అవినీతి నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలి.
2. విధులపై స్పష్టత
లోక్‌పాల్‌ ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు జరిపి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న కేసులను లేదా ప్రాసెక్యూషన్‌ చేసి శిక్షించతగ్గ కేసులను ప్రత్యేక కోర్టులకు నివేదించడం వంటి కార్యక్రమాలను నిర్దిష్ట కాల పరిమితిలో నిర్వహించాలి. సుమోటోగా దర్యాప్తుకు సిఫార్సు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలి. కేంద్రీయ స్థాయిలో అవినీతికి సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు అందుబాటులో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. చివరగా, నిర్దిష్ట చర్యను సిఫార్సు చేసే లేదా ఇది సాధ్యం కాని చోట కోర్టులకు వెళ్లేందుకు దానికి అధికారం ఉండాలి.
లోక్‌పాల్‌కు క్వాజీ జ్యుడీషియల్‌ అధికారాలు కల్పించాలి. ఈ బాధ్యతలను స్వతంత్రంగా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, నిర్ణీత కాల వ్యవధికి లోబడి నిర్వర్తించేందుకు సార్వభౌమాధికారం కల్పించాలి.
శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రాజ్యాంగం మౌలిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉంది. లోక్‌పాల్‌ వ్యవస్థ ఈ మౌలిక స్వరూపానికి అనుగుణంగా ఉండాలి.
లోక్‌పాల్‌ అవినీతికి సంబంధించిన కేసులను విచారిస్తుందా లేక సమస్యల పరిష్కార కేంద్రంగా కూడా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఈ రెండు విధుల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని సిపిఎం కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ప్రత్యేక శాసనం ద్వారా దీనిని ఏర్పాటు చెయ్యాలి. పౌర నిబంధనావళికి సంబంధించిన సమస్యలను ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి.
3. లోక్‌పాల్‌ ఎంపిక, కూర్పు
ఈ చట్టం తీసుకురావడంలో ఉద్దేశాన్ని లోక్‌పాల్‌ చట్టం స్పష్టంగా నిర్దేశించాలి. లోక్‌పాల్‌ను నియమించేందుకు పరిగణనలోకి తీసుకునే సామర్థ్యం, అనుభవం, అర్హత మొదలైన అంశాలపై స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశించాలి. లోక్‌పాల్‌ను ఎంపిక చేసే కమిటీ విస్తృత ప్రాతిపదికతో కూడుకున్నదై ఉండాలి. అందులో కార్యనిర్వాహక అధికారులు, పార్లమెంటరీ నాయకులతో, ఉన్నత న్యాయ వ్యవస్థ సభ్యులు, న్యాయమూర్తులు, విద్యావేత్తలకు చోటు కల్పించాలి. ఎంపిక కమిటీ నియమించిన సెర్చ్‌ కమిటీ కూడా విస్తృత ప్రాతిపదిక కలిగినదై ఉండాలి.
కూర్పు: ఛైర్‌పర్సన్‌తో పాటు లోక్‌పాల్‌లో మొత్తం పది మంది సభ్యులు ఉండాలి. ఇందులో నలుగురు న్యాయవ్యవస్థకు చెందిన వారై ఉండాలి. ముగ్గురు పాలనా యంత్రాంగం, పౌర సర్వీస్‌ నేపథ్యం గలవారై ఉండాలి. మిగిలిన ముగ్గురు న్యాయ, విద్యా, సామాజిక సర్వీస్‌ రంగానికి చెందినవారై ఉండాలి. వాణిజ్య, పరిశ్రమల రంగానికి చెందినవారికి, రాజకీయ నాయకులకు స్థానం కల్పించరాదు.
పరిధి : ఉన్నత స్థానాల్లో అవినీతిని ప్రాధాన్యతా ప్రాతిపదికపై నిర్మూలించాలి. దైనందిన జీవితంలో, అధికారులతో వ్యవహరించే సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొనే అవినీతిని అత్యవసర ప్రాతిపదికపై పరిష్కరించాలి. ఇటువంటి అవినీతిలో అధిక భాగం రాష్ట్ర స్థాయిలో అధికారులతో జరిపే వ్యవహారాలకు సంబంధించినవై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లను లోక్‌పాల్‌ తరహాలో నియమించిన లోకాయుక్తల పరిధిలోకి తీసుకురావాలి. మనం ప్రతిపాదించిన సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని విడిగా ఏర్పాటు చెయ్యాలి. మౌలిక సర్వీసులు, పౌరుల హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ యంత్రాంగం పరిష్కరించాలి.
ఎ.ప్రధాని: తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రధాన మంత్రిని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలి. ప్రధాన మంత్రి, ప్రజా సేవకులందరినీ 1969లో అప్పటి విపిసింగ్‌ ప్రభుత్వం లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆ తరువాత రూపొందించిన ముసాయిదా బిల్లుల్లో కూడా ప్రధానమంత్రిని లోక్‌పాల్‌ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని స్థాయీ సంఘం కూడా 2011 లోక్‌పాల్‌ బిల్లును పరిశీలించే సమయంలో ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 1989 తరువాత మొదటిసారి అనేక కుంభకోణాలకు ఆలవాలమైన ఈ ప్రభుత్వం అత్యున్నత కార్యాలయానికి నిర్దిష్ట బాధ్యతలను నిర్ధారించేందుకు నిరాకరిస్తోంది. ప్రధానితోసహా అవినీతి నిరోధక చట్టం నిర్వచనం కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ సేవకులనందరినీ లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలి.
బి. న్యాయవ్యవస్థ: న్యాయవ్యవస్థను కూడా నిఘా వ్యవస్థ పరిధిలోకి తీసుకురావల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులను వారు నిర్వహించే కార్యకలాపాలకు బాధ్యులుగా చెయ్యాలి. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసి దర్యాప్తు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన వారికి రక్షణ కవచంగా పరిణమించింది. అయితే వారిని లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలు రాజ్యాంగం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించడమే అవుతుంది. ఎవరైనా దురుద్దేశంతో న్యాయమూర్తుల కార్యకలాపాలపై ఆరోపణలు చేస్తే లోక్‌పాల్‌ దర్యాప్తు జరపడం వల్ల వారు నిర్భీతిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉండదు.
సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను జాతీయ న్యాయ కమిషన్‌ పర్యవేక్షించాలి. ఉన్నత స్థాయిలో నియామకాలను, వారి ప్రవర్తనను అదే పర్యవేక్షించాలి. వారిపై వచ్చే అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చెయ్యాలి. ఇందుకోసం అవసరమైన శాసనాన్ని చెయ్యాలి. 2010 న్యాయ ప్రమాణాలు, బాధ్యతల నిర్ధారణ బిల్లు ఈ దిశగా ఎంతమాత్రం సరిపోదు.
సి.పార్లమెంటు సభ్యులు: పార్లమెంటు సభ్యులు అవినీతికి పాల్పడితే వారిపై దర్యాప్తు జరిపి చర్య తీసుకునే ప్రస్తుత వ్యవస్థ లోపభూయిష్టంగా, అసంతృప్తికరంగా ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ, ఓటింగ్‌లో పాల్గొనే స్వేచ్ఛ కల్పించడం ద్వారా రాజ్యాంగంలోని 105వ ప్రకరణం పార్లమెంటు సభ్యులకు రక్షగా ఉంది. ఈ స్వేచ్ఛ, రక్షణలు పార్లమెంటు సభ్యుల అవినీతి చర్యలకు విస్తరించకుండా ఏమి చేయాలన్నదే అసలు సమస్య.
105వ ప్రకరణాన్ని సవరించడమే ఇందుకు మార్గం. రాజ్యాంగ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ ప్రకరణాన్ని సవరించాలి.
ఇందుకు ప్రత్యామ్నాయంగా పార్లమెంటులో ఓటింగ్‌, మాట్లాడటం వంటి చర్యలను ప్రేరేపించే విధంగా పార్లమెంటు సభ్యుడెవరైనా అవినీతికి పాల్పడితే ఆ అవినీతి చర్య అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షా స్మృతి పరిధిలోకి వచ్చే విధంగా సాధ్యమైతే శాసనం చెయ్యాలి.
5.లోకాయుక్తలు: రాష్ట్రాల్లో లోకాయుక్తలను కేంద్రంలో లోక్‌పాల్‌ తరహాలో నియమించాలి.
6. ఫిర్యాదిదారుల రక్షణ: అవినీతిపై పటిష్టంగా పోరాటం చేసేందుకు అవినీతిపై ఫిర్యాదు చేసే వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది లోక్‌పాల్‌ విధి నిర్వహణలో భాగం కావాలి. ఇందుకు చట్టపరంగా అవకాశం కల్పించాలి. 2010 ప్రజాప్రయోజన విషయాల వెల్లడి (సమాచార రక్షణ) చట్టం ఇందుకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలి.
7.బడా వ్యాపార- ప్రజాసేవకుల రహస్య సంబంధాలు:
బడా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు- ప్రభుత్వ సేవకుల మధ్య రహస్య సంబంధాలు అవినీతికి మూలాలనే విషయాన్ని గుర్తించాలి. వ్యాపార సంస్థలతో సంబంధంగల కేసులను దర్యాప్తు చేసే లోక్‌పాల్‌ అవినీతి పద్ధతుల ద్వారా ఆ సంస్థలు తీసుకునే లైసెన్స్‌లు, కుదుర్చుకునే ఒప్పందాలు, లీజ్‌లను రద్దు చెయ్యాలి. అటువంటి కంపెనీలను భవిష్యత్తులో ఎటువంటి కాంట్రాక్టులు, లైసెన్స్‌లు పొందకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అధికారం కూడా లోక్‌పాల్‌కు ఉండాలి. అదేవిధంగా లబ్ధిదారుడు వ్యాపార సంస్థ అయితే కోశాగారానికి వచ్చే నష్టాన్ని ఆ సంస్థ నుండి వసూలు చెయ్యాలని సిఫార్సు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలి. ప్రభుత్వం ఈ సిఫార్సులను మామూలుగా అమోదించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
ముగింపు: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడంతోపాటు అవినీతికి వ్యతిరేకంగా న్యాయ, పాలనాపరమైన వ్యవస్థను పటిష్టం చేసే విధంగా ఏక కాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం భావిస్తోంది. ఇందుకుగాను ఈ కింది చర్యలు తీసుకోవాలి.
1.జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థను దాని పరిధిలోకి తీసుకురావాలి. 2.పౌరుల సమస్యలు పరిష్కరించేందుకుగాను వారి హక్కుల పరిరక్షణకై ఒక చట్టం తీసుకురావాలి. 3.పార్లమెంటు సభ్యులను అవినీతి నిరోధక నిఘా కిందకు తీసుకువచ్చేందుకు రాజ్యాంగంలోని 105వ ప్రకరణాన్ని సవరించాలి. 4.ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాలి.
5.రాష్ట్రాల స్థాయిలో ప్రజాసేవకులందరికీ వర్తించే విధంగా లోకాయుక్తలను నియమించాలి 6.నల్లధనాన్ని వెలికితీసి సరళతరమైన పన్నుల వ్యవస్థ గల దేశాల్లోని (టాక్స్‌ హావెన్స్‌) నిధులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment