Sunday, July 24, 2011

ఉద్యోగుల ఆందోళనలు - రోగుల ఇబ్బందులు పరిష్కరించాలి

- ఉస్మానియా ఆస్పత్రి'పై సిఎంకు జూలకంటి లేఖ

రెండు రోజుల నుండి ఉస్మానియా ఆస్పత్రిలో జరుగుతున్న ఆందోళనల వల్ల రోగులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం ద్వారా రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోని రేడియాలజీ, ల్యాబెటరీలు, కంప్యూటర్‌ విభాగాల్లో మొత్తం 40 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కింద గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి నెలకు రూ.3,500 నుండి 5 వేల వరకు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చే అరకొరా వేతనాలు కూడా ఆరు నెలకొకసారి చెల్లిస్తున్నారని వివరించారు. గత ఏడు నెలల నుండి జీతాలు చెల్లించకపోవటంతో వివిధ విభాగాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. జీవోనెం.3 ప్రకారం పెంచిన వేతనాలను సైతం వీరికి చెల్లించటం లేదని పేర్కొన్నారు. కనీసం గాంధీ ఆస్పత్రిలో ఇస్తున్న వేతనాలను కూడా ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఉద్యోగులను రెన్యువల్‌ చేసుకోలేదని, ఆస్పత్రి అధికారులు ఈ విషయంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాకపోవటంతో ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అభద్రతాభావంతో ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం రేడియోలజీ, ల్యాబ్‌ టెక్నీషియన్లు, కంప్యూటర్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ వృత్తినైపుణ్యం, అనుభవం కలిగిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఖాళీ పోస్టుల్లో క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయాలంటూ డిఎమ్‌ఇ అనుమతిస్తూ ఆస్పత్రి అధికారులకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా జూలకంటి గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయించాలని కోరారు. తద్వారా రోగుల ఇబ్బందులను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.

No comments:

Post a Comment