Saturday, July 30, 2011

ముదిగొండ అమరుల స్ఫూర్తితో... మళ్లీ భూ పోరాటాలు

ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళర్పిస్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

ముదిగొండ భూ పోరాట అమరుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో వామపక్షాల ఆధ్వర్యాన సమైక్యంగా, ఉమ్మడిగా భూ పోరా టాలను నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రస్తుతం రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిస్‌, గిరిజన సంఘం ఆధ్వర్యాన దళితులు, గిరిజనులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆందోళనలు జరుగు తున్నాయన్నారు. కౌలు రైతుల సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, గిరిజన ప్రాంతాల్లో వైద్యం తదితర సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత భూ పోరాటాలకు కార్యాచరణ రూపొంది స్త్తామని తెలిపారు. వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా చేపట్టడానికి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ముదిగొండ భూ పోరాట అమరవీరుల నాలుగో వర్థంతి సభ గురువారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సిఐటియు సీనియర్‌ నాయకులు రాజారావు, ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులు, దళి తులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల వారికోసం ముదిగొండ అమరవీరులు ప్రాణత్యాగం చేశారన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలా లను, భూమి పంచాలంటూ చేసిన పోరాటంలో వారు తమ ప్రాణా లను ఫణంగా పెట్టారని చెప్పారు. ఆ అమరవీరుల ఆశయాలను పూర్తిగా సాధించలేకపోయినప్పటికీ వారి స్ఫూర్తితో దళితులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, కౌలు రైతుల రుణార్హత కార్డులు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందజేయ టం తదితర అంశాల్లో పార్టీ, ప్రజా సంఘాలు పూర్తిగా నిమగమై ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీ ఏరియాల్లో వ్యాధుల నివారణకు ప్రభు త్వం చర్యలు చేపడితే పార్టీలు, ప్రజాసంఘాలు సాయం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఆయా ప్రాంతాల్లో గిరిజన సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యాన వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారని గుర్తుచేశారు. తీరా గుర్తింపు కార్డులిచ్చిన తర్వాత రుణం కోసం రైతులు బ్యాంకుకెళితే అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కౌలు రైతులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. గిరిజనులు అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు పట్టాలివ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం అమలుకోసం పోరాడినందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియాలో ఇద్దరు పార్టీ కార్యకర్తలపై పిడి యాక్టు కింద కేసులు పెట్టారని అన్నారు. వారిని విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పారు. చివరికి కోర్టు జోక్యంతో వారు విడుదలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ముదిగొండ అమరుల స్ఫూర్తితో భవిష్యత్తులో వివిధ ప్రజా సమస్యలతోపాటు భూ సమస్యను ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని రాఘవులు పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో వీర తెలంగాణా సాయుధ పోరాట కాలం నుండి నేటి వరకు అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ పోరాటాల్లో పాల్గొని అనేక మంది పోలీసు తూటాలకు బలయ్యారని తెలిపారు. భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ఉపాధితోపాటు ఆదాయ వనరుకూడా కావటంతో భూ సమస్య అత్యంత కీలకమైందన్నారు. వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలవారి పిల్లలకు ఉపయోగపడే హాస్టళ్లు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను వారికి దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే వంద మంది పిల్లల కంటే తక్కువగా ఉన్న హాస్టళ్లను మూసేయాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ అంశాలపై ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాలు పోరాడుతున్నాయని, వాటికి సిపిఎం పూర్తి మద్దతునిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై ఇప్పటికే 11 వామపక్షాల ఆధ్వర్యాన ఆందోళనలు జరుతున్న నేపథ్యంలో...రాబోయే రోజుల్లో ఏయే అంశాలపై ఆందోళనలు నిర్వహించాలనే విషయమై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించేందుకు ఆగస్టు 4న లెఫ్ట్‌ పార్టీలు సమావేశమవుతున్నాయని తెలిపారు. తద్వారా ప్రజా సమస్యలపై పోరాటాల్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment