Sunday, July 31, 2011

అమెరికా మెప్పు కోసం ఇరాన్‌ చమురును కాలదన్నిన భారత్‌

వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
''అణ్వాయుధాలతోసహా పెద్ద ఎత్తున విధ్వంసానికి దారితీసే ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు చేస్తున్న యత్నాల నుండి ఇరాన్‌ను అడ్డుకునేందుకు, ఆ దేశాన్ని ఒంటరిపాటు చేసేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు అమెరికా, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ సంపూర్ణంగా , చురుగ్గా సహకరిస్తుందా?లేదా? ఇందుకు సంబంధించి అది నిర్దిష్టంగా చేపట్టిన చర్యలేమిటి అన్నదానిని బట్టి భారత్‌పై ఒక అంచనాకు రావడం జరుగుతుంది''. - (2006 హైడ్‌ ఒప్పందంలోని 104 జి (2), ఇ (1)ను పాటించడంపై వార్షిక సర్టిఫికెట్‌ను అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్‌కు సమర్పించే నివేదిక)
భారత్‌ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో 12 శాతం మొత్తాన్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. ఇరాన్‌ నుండి రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. గత కొద్ది మాసాలుగా భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యకపోవడంతో చమురు సరఫరా ఆగస్ట్‌ నెలలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్‌ చమురు కంపెనీలకు భారత్‌ ఐదు వందల కోట్ల డాలర్లు బకాయిపడింది. చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చెయ్యకపోతే చమురు సరఫరాలను అనివార్యంగా నిలిపివేయాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితి ఎందుకేర్పడింది? ఇరాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారత్‌ దాసోహమంది. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ పరిశ్రమలను అస్తవ్యస్తం చేసే ఉద్దేశంతో ఇరాన్‌పై అమెరికా 2010 ఆగస్ట్‌లో పలు ఆంక్షలు విధించింది. 1929 తీర్మానం ద్వారా ఇరాన్‌పై భద్రతా మండలి విధించిన ఆంక్షలు 2010 జూన్‌ నాటికి ముగిశాయి. ఇరాన్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో బ్యాంకింగ్‌, విదేశీ మారక లావాదేవీలను నిషేధిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించాయి.
అమెరికా ఒత్తిడికి లొంగడం
భద్రతా మండలి విధించిన ఆంక్షలను మాత్రమే కాకుండా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను కూడా భారత్‌ పాటిస్తోంది. ఈ ఆంక్షల ఒత్తిడి కారణంగా ఆసియన్‌ క్లియరింగ్‌ యూనియన్‌ (ఎసియు) ద్వారా ఇరాన్‌కు వర్తక సంబంధ చెల్లింపులన్నిటినీ రిజర్వు బ్యాంక్‌ నిలిపివేసింది. ఇరాన్‌కు భారత్‌ దీర్ఘకాలంగా ఈ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుపుతోంది. ఎసియును నిలిపివేయడంతో చెల్లింపులు ఎలా చెయ్యాలనే సమస్య తలెత్తింది. జర్మన్‌ కేంద్ర బ్యాంక్‌ అయిన బుండెస్‌బ్యాంక్‌ ద్వారా ముడి చమురు దిగుమతులకు చెల్లింపులు జరిపేందుకు భారత్‌, ఇరాన్‌ ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. హాంబర్గ్‌లోని యూరప్‌ ఇరాన్‌ వర్తక బ్యాంక్‌ (ఇఐహెచ్‌)కు బుండెస్‌ బ్యాంక్‌ నగదును బదిలీ చేస్తుంది. ఈ బ్యాంక్‌కు ఎటువంటి ఆంక్షలు వర్తించవు. అయితే కొన్ని వారాల తరువాత అమెరికా, ఇజ్రాయిల్‌ ఒత్తిడిపై జర్మనీ ప్రభుత్వం ఈ లావాదేవీలను నిలిపివేసింది. ఇరాన్‌ చమురు సరఫరాలను కొనసాగించినప్పటికీ భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యలేదు.
భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న రెండవ అతి పెద్ద దేశం ఇరాన్‌. కాగా, సౌదీ అరేబియా అగ్ర స్థానంలో ఉంది. ఇరాన్‌తో చమురు వర్తకం కొనసాగించే విషయంపై కాకుండా ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషించే కృషిలో యుపిఏ ప్రభుత్వం ఉంది. ఇరాన్‌ నుండి కాకుండా సౌదీ అరేబియా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని భారత్‌కు అమెరికా సూచిస్తోంది.
భారత్‌-అమెరికా మధ్య అణు ఒప్పందం కుదిరినప్పటి నుండి ఇరాన్‌తో భారత్‌ సంప్రదాయసిద్ధమైన సంబంధాలు దెబ్బతినడం ప్రారంభించాయి. భారత్‌ విదేశాంగ విధానం తమ దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉండాలన్న విషయాన్ని అణు ఒప్పందం నిర్ధారించిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించడం, దానిని ఒంటరిపాటు చేసే విషయమై భారత్‌ ఏ విధంగా సహకరిస్తోందో అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు సంవత్సరానికొకసారి నివేదిక సమర్పించాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. రెండు దేశాల మధ్య అణు సహకారం ఇందుకు అవకాశం కల్పిస్తోంది. జాతీయ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా భారత విదేశాంగ విధానంలో మార్పులు చేయడాన్ని వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
2005 జులైలో భారత్‌- అమెరికా సంయుక్త ప్రకటనపై జార్జి బుష్‌, మన్మోహన్‌ సింగ్‌ సంతకాలు చేసిన కొద్ది వారాల్లోనే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఎఇఎ చేసిన ప్రతిపాదించిన తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు చేసింది. అలీన దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమో, ఓటింగ్‌కు గైర్హాజర్‌ కావడమో చేయగా భారత్‌ అమెరికా ఆదేశాలకు అనుగుణంగా తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసింది. 2006 ఫిబ్రవరిలో ఇరాన్‌పై మరోసారి ఐఎఇఎ తీర్మానానికి అనుకూలంగా అది ఓటు చేసింది. హైడ్‌ చట్టంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా ఈ విషయాలను అమెరికా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.
గ్యాస్‌పైప్‌లైన్‌
ఇరాన్‌- పాకిస్తాన్‌- భారత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ తదుపరి లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ముందడుగు వేయవద్దని అమెరికా పలుమార్లు భారత్‌ను హెచ్చరించింది. భారత్‌ దీనిని తు.చ తప్పకుండా పాటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును నిలిపివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. రెండు సంవత్సరాలకు పైగా వేచి చూసిన ఇరాన్‌, పాకిస్తాన్‌ ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించాయి. పాకిస్తాన్‌ సరిహద్దు వరకు ఈ పైప్‌లైన్‌ను ఇరాన్‌ ప్రస్తుతం నిర్మిస్తోంది.
తుర్క్‌మెనిస్తాన్‌-ఆప్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌- ఇండియా (టిఎపిఐ) పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ దిగుమతి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. అమెరికా సూచన మేరకే భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎఇఎలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యడంతో లిక్విఫయిడ్‌ గ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య 25 సంవత్సరాల ఒప్పందం ముగిసింది. ఇరాన్‌లో భారత వాణిజ్య ప్రాజెక్టులు అంచెలంచెలుగా రద్దవుతున్నాయి. అమెరికా బెదిరింపునకు తలవంచి రిలయెన్స్‌ 280 మిలియన్‌ డాలర్ల విలువచేసే గ్యాసోలిన్‌ ఎగుమతులను నిలిపివేసింది. ఇరాన్‌తో ప్రధాన వాణిజ్య సంబంధమైన చమురు ఎగుమతులు దాదాపు అంతరించిపోయే స్థితి నెలకొంది.
అమెరికాకు విజ్ఞప్తి
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త కనిపించింది. భారత్‌- ఇరాన్‌ మధ్య ఏడు మాసాలుగా నెలకొనిఉన్న చెల్లింపుల సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో ఉందని ఆమెతో కలసి చెన్నరు సందర్శించిన అమెరికా అధికారి పేర్కొన్నట్లుగా ఆ వార్త పేర్కొంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని పెద్దన్న అమెరికాను భారత్‌ వేడుకున్నట్లు ఈ వార్త స్పష్టం చేస్తుంది. ఇరాన్‌ నుండి చమురు సరఫరాలు నిలిచిపోవడానికి అమెరికానే బాధ్యతవహించాల్సి ఉంటుంది. చమురు సరఫరాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఇటువంటి అక్రమ చర్యలను ప్రతిఘటించాల్సింది పోయి ఇరాన్‌ నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని అమెరికాను భారత్‌ దేబిరిస్తోంది.
పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకునేందుకు ఇరాన్‌ను ఒంటరి చెయ్యాలనే అమెరికా లక్ష్యానికి సహకరించడం ద్వారా భారత్‌ తన ప్రయోజనాలను పణంగా పెడుతోంది. అమెరికాకు సన్నిహిత మిత్రపక్షాలైన జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను కొనసాగిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షలకు విరుద్ధంగా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండగా భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా అమెరికా లక్ష్యానికి అనుగుణంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నాటో కూటమిలో భాగస్వామ్య దేశమైన టర్కీ చమురు రంగంలో ఇరాన్‌తో తాజాగా కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకుంది. చైనా కూడా ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను అధికం చేసింది. ఇరాన్‌ నుండి చైనా దిగుమతులు జూన్‌లో 53.2 శాతం పెరిగాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు, నిర్దేశిత మార్గం నుండి దారి మళ్లేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు, కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ క్రియాశీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు వార్షికంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. ఇతర దేశాల నుండి భారత్‌ ముడి చమురు దిగుమతి చేసుకోవచ్చు. అయితే అమెరికా ముందు సాగిలపడే యుపిఏ ప్రభుత్వ వైఖరి మన దేశ ఆత్మగౌరవాన్ని , దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
-ప్రకాశ్‌ కరత్‌

No comments:

Post a Comment