Sunday, July 24, 2011

పోరాటాలతోనే అవినీతి అంతం

  • దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలి
  • వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి అంతానికి కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటితోపాటు బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించాలని 11 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మధ్య వెలుగు చూసిన 2జి స్పెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ క్రీడలు, ఐపిఎల్‌, ఆదర్శ్‌ హౌసింగ్‌, తదితర కుంభకోణాల ద్వారా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, వారి అనుయాయులకు సంబంధించిన వివిధ కంపెనీలు ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున లూటీ చేశాయని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. తద్వారా దేశానికి, ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని విమర్శించారు. అవినీతి ద్వారా ఆర్జించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంటున్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న కొద్దిపాటి హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రజలు అవినీతిపై పోరాడాల్సిన అవసరముందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్‌), సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ (ఎంఎల్‌), ఆరెస్పీ, ఎంఎల్‌ కమిటీ, ఎంసిపిఐ (యు), ఎస్‌యుసిఐ (సి) పార్టీల ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అవినీతి వ్యతిరేక సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని తీర్మానించింది.
పాలకులే కారణం : రాఘవులు
దేశ పాలకులే అవినీతికి ప్రధాన కారణమని సదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాట్లాడుతూ చెప్పారు. 1948 నుంచి ఇప్పటి వరకూ దేశంలో సాగిన కుంభకోణాల్లో రూ.900 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్ములో దాదాపు రూ.71 లక్షల కోట్లు స్విస్‌బ్యాంకులో దాచి పెట్టారని అన్నారు. ఈ విధంగా ఇతర దేశాల్లో దాచిపెట్టిన సొమ్మును దేశానికి ఉపయోగపడకుండా చేస్తున్నారని విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో కొల్లగొట్టబడిన రూ.1,76,000 కోట్లతో దేశంలోని 120 కోట్ల మందికి కిలో బియ్యం రూ.2 చొప్పున ఏడాదిపాటు పంపిణీ చేయొచ్చని చెప్పారు. దేశంలోని పిల్లలందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఆహారం అందజేస్తూ ఉచిత విద్యనందించవచ్చని వివరించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతి వల్ల కేవలం దేశానికి నష్టం కలగడమేగాక ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలుగుతోందని చెప్పారు. రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయిలో అవినీతికి తోడు సాధారణ స్థాయి అవినీతి కూడా పెచ్చరిల్లడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మార్వో ఆఫీసుకో, ఒక ఆస్పత్రికో లేక మరో పోలీస్‌ స్టేషన్‌కో వెళ్తే లంచం ఇవ్వందే పని జరగడం లేదన్నారు. దీంతో సాధారణ ప్రజానీకం నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయిలో అవినీతికి పాల్పడిన వారికి చట్టబద్ధంగా శిక్షపడే విధంగా చర్యలుండాలని అన్నారు. ఇదే సమయంలో జనలోక్‌పాల్‌ బిల్లు వస్తే దేశంలో అవినీతి పూర్తిగా అంతమవుతుందని భావించడం సరి కాదని అన్నారు. అవినీతి అంతానికి ఈ బిల్లు ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, దీంతోపాటు బలమైన ప్రజా ఉద్యమాలు అవసరమని చెప్పారు. లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని చేర్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎన్నికల విధానంలో మార్పులు తేవాలని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించి వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రాతినిధ్యాన్ని కల్పించాలని అన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు సైతం అవినీతిపై స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణ కొనసాగు తున్న నేపథ్యంలో తన ఆస్తులపై జరుపుతున్న విచారణను ఆపాలంటూ జగన్‌ సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని రాఘవులు తప్పుబట్టారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎవరైనా డిమాండ్‌ చేస్తే విచారణకు తాము సిద్ధమే అంటూ ప్రకటించాల్సింది పోయి సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు..
అవినీతిపై పోరాడే హక్కు లెఫ్ట్‌కే ఉంది : నారాయణ
దేశంలో అవినీతిపై పోరాడే నైతిక హక్కు కేవలం వామపక్షాలకే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విధాన నిర్ణయాల్లోనే రాజకీయ అవినీతి దాగుందని చెప్పారు. ఈ రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా మొత్తం అవినీతిని నిర్మూలించలేమని అన్నారు. యుపిఎ-1 హయాంలో ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉన్నందు వల్ల అనేక ప్రజా వ్యతిరేక, అవినీతికర నిర్ణయాలను నిలువరించగలిగామని చెప్పారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్య ప్రభావం భారతదేశంపై పడలేదంటే దానికి కారణం వామపక్షాలేనని తెలిపారు. అణు ఒప్పందాన్ని లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వందల కోట్ల రూపాయలను యుపిఎ-1లోని పెద్దలు వెదజల్లారని విమర్శించారు.
సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమించిన సమయంలో అవినీతిలో కూరుకుపోయిన బూర్జువా పార్టీలు సైతం ఆయనకు మద్దతు పలకడం హాస్యాస్పందంగా ఉందన్నారు. సిపిఐ (ఎంఎల్‌) నాయకులు గుర్రం విజయకుమార్‌ మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అన్ని రంగాల్లో అవినీతి విలయతాండవం చేస్తోందని చెప్పారు. ఈ సదస్సులో ఎన్‌ మూర్తి (సిపిఐ ఎంఎల్‌-లిబరేషన్‌), ఎల్‌ మురళీధర్‌ దేశ్‌పాండే (ఫార్వర్డ్‌బ్లాక్‌), జివి రాఘవులు (సిపిఐ ఎంఎల్‌), జానకిరాములు (ఆరెస్పీ), కొల్లిపర వెంకటేశ్వరరావు (ఎంఎల్‌ కమిటీ), మర్రెడ్డి వెంకటరెడ్డి (ఎంసిపిఐ-యు), సిహెచ్‌ మురహరి (ఎస్‌యుసిఐ-సి) ప్రసంగించారు.

No comments:

Post a Comment