Tuesday, July 26, 2011

ఏజెన్సీలో ప్రాణాంతక వ్యాధులు నివారించండి

  • వైద్యశాఖ మంత్రికి సిపిఎం వినతి
  • గిరిజన సంఘం, జెవివి ఆధ్వర్యాన వైద్య శిబిరాలు
  • తగు చర్యలు తీసుకుంటాం : డిఎల్‌ హామీ
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌, తదితర ప్రాణాంతక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పు గోదావరి, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లా ములుగు, తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో తగినంత మంది వైద్య సిబ్బంది, మందులు లేకపోవడం వల్ల గిరిజనులు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొంటూ సిపిఎం నేతలు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధు, శాసన సభ్యుడు జూలకంటి రంగారెడ్డి వైద్యశాఖ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డికి సోమవారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధుల విజృంభణ హెచ్చు స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో సిపిఎం బృందాలు పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు, ముంచంగిపుట్టుల్లో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణ కోసం అంబులెన్సులు, మందులు, వైద్య సిబ్బందితో పాటు ఇతర సహాయ సహకారాలను అందజేయాలంటూ మంత్రిని కోరామన్నారు.

మలేరియా, టైఫాయిడ్‌ నివారణకు తగు చర్యలు తీసుకుంటామని, వైద్య శిబిరాలకు అవసరమైన సాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీల్లోని పిహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడం వల్ల టైఫాయిడ్‌, మలేరియా వ్యాధులను నిర్ధారించే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కారణంగా ఆయా వ్యాధుల తీవ్రత తగ్గినట్లు కన్పిస్తోందని చెప్పారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ఏరియాలో 33 పిహెచ్‌సీలుంటే, రెండు నెలల క్రితం 15 పిహెచ్‌సీల్లో వైద్యులను నియమించారని తెలిపారు. వారు ఇతర ప్రాంతాల క్యాంపులకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ నమోదు చేసేవారు కూడా ఉండటం లేదని వివరించారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని 11 ఏజెన్సీ మండలాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధి తీవ్రంగా ఉందన్నారు. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రోజుకు 300 మంది జ్వర బాధితులను పరీక్షిస్తే వారిలో 60 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని అన్నారు. అంటువ్యాధుల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత ఇంతలా ఉండేది కాదన్నారు. పెరుగుతున్న జనాభా, వ్యాధుల తీవ్రతను బట్టి మందుల బడ్జెట్‌ను పెంచాల్సింది పోయి క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారని విమర్శించారు. ప్రాణాంతకమైన ఫాల్స్‌ఫామ్‌ (పిఎఫ్‌) మలేరియా విశాఖతోపాటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో అత్యధికంగా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత రీత్యా గిరిజన ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలందించేందుకు డిప్యూటేషన్‌పై డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందిని నియమించి మందుల సరఫరాను మెరుగుపరచాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. మందుల కొనుగోలుకు నిధుల కొరత లేకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన 758 హైరిస్క్‌ గ్రామాలన్నింటిలోనూ వైద్య శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పిహెచ్‌సి, సబ్‌సెంటర్లకు వైద్య నిమిత్తం వచ్చే రోగులకు, వారి సహాయకులకు భోజన సదుపాయం కల్పించాలని, రోగుల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చే సిహెచ్‌డబ్ల్యూలకు రవాణా ఖర్చులు చెల్లించాలని మధు, జూలకంటి కోరారు. ఈ అంశాలన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment